కాల్‌ మనీ.. కేటుగాళ్లు | - | Sakshi
Sakshi News home page

కాల్‌ మనీ.. కేటుగాళ్లు

Mar 18 2025 8:37 AM | Updated on Mar 18 2025 8:38 AM

చీరాల: చీరాల పట్టణం, రూరల్‌ మండంలోని గ్రామాలు, వేటపాలెం మండలంలోని గ్రామాల్లో కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని రోజువారీ కూలీలకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి రోజువారీగా వసూలు చేస్తూ పేదల రక్తాన్ని వడ్డీలతో పీల్చుకు తాగుతున్నారు. ఇలా చీరాలలో కాల్‌మనీ కేటుగాళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఇల్లు రాసివ్వడం, లేదంటే ఊరు వదిలి వెళ్లిపోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి.

రూ.100కు వడ్డీ రూ.30 వరకు..

కాల్‌మనీ వ్యాపారులకు అసలు కంటే వడ్డీపైనే ఆశ ఎక్కువ. పేదల అవసరాలను క్యాష్‌ చేసుకుంటూ లక్షలు గడిస్తున్నారు. అత్యవసరమై ఈ కాల్‌మనీ వ్యాపారి వద్ద రూ.10 వేలు వడ్డీకి తీసుకుంటే ఆ అప్పు చెల్లించే నాటికి రూ.40 వేలు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి. పట్టణంలోని శివారు కాలనీలో చేతివృత్తులు చేసుకునే వారు. రోజువారీ కూలీలు, రిక్షా కార్మికులు వీరిబారిన పడి ఆస్తులను పోగొట్టుకొంటున్నారు. ఒక్కో వ్యాపారి సగటున నెలకు వడ్డీల రూపంలో రూ.10 లక్షలు గడిస్తున్నారని సమాచారం.

ఆర్థిక అవసరాలే క్యాష్‌..

చీరాల పట్టణంలో పేదలు అధికంగా నివసించే దండుబాట, పాలేటి నగర్‌, దళిత వాడలు, తమిళ కాలనీలు, స్వర్ణరోడ్డు, గాంధీనగర్‌, ఆనందపేట, వైకుంఠపురం, విఠల్‌నగర్‌, హరిప్రసాద్‌నగర్‌, హయ్యర్‌పేట, థామస్‌పేట, గొల్లపాలెం తదితర ప్రాంతాల్లోని పేదలే ఈ కాల్‌మనీ కేటుగాళ్లకు ఆవాస కేంద్రాలు. పేదప్రజల ఆర్థిక అవసరాలను క్యాష్‌ చేసుకుంటున్నారు. చీరాల మండలంలోని ఈపురుపాలెం శివారు కాలనీలు, సాయికాలనీ, తోటవారిపాలెం, సాల్మన్‌ సెంటర్‌, రామకృష్ణాపురం, కొత్తపాలెం, చీరాలనగర్‌ గ్రామాలతో పాటుగా వేటపాలెంలోని ఆరు గ్రామ పంచాయతీల్లో కాల్‌మనీ ఆగడాలకు పెట్రేగిపోతున్నాయి. తీసుకున్న అప్పులకు చక్రవడ్డీలు చెల్లించలేక ఉన్న ఒక్క ఇంటిని వారికి ఇచ్చి ఆ పేదలు ఊరి వదిలి వెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి.

మళ్లీ పుట్టగొడుగుల్లా మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు..

పేదలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కాల్‌ మనీ వ్యాపారులు, ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు మళ్లీ వచ్చాయి. శాతవాహన, మారుతీ, సునీత, షేర్‌, స్పందన తదితర మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు మళ్లీ వ్యాపారాలు ప్రారంభించాయి. ఇవే కాక కొన్ని స్టార్‌ ఫైనాన్సియర్లు పేదల ఇళ్లను తాకట్టుపెట్టుకుని అధిక వడ్డీలు చెల్లించలేక వారి ఇళ్లను లాక్కుంటున్నారు.

అడ్డుకట్ట వేయలేకపోతున్న ప్రభుత్వం..

కాల్‌మనీ, ప్రైవేటు ఫైనాన్స్‌ వ్యాపారుల ఆగడాలు పెట్రేగిపోతున్నా, పలు ఫిర్యాదులు అందుతున్నా కానీ అధికారులు, ప్రభుత్వ పెద్దలు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కాల్‌మనీ వ్యాపారాలు చేసే వారిలో చాలామంది టీడీపీ నేతల అనుచరులు, వారి నాయకుల వెనుకుండి వ్యాపారాలు చేయిస్తున్నారు.

చీరాలపై పగడవిప్పిన పైశాచికం రూ.80 వేల ఇచ్చి రూ.5.75 లక్షలు ఇవ్వాలంటూ ఓ రౌడీషీటర్‌ బెదిరింపు ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలు మళ్లీ విస్తరిస్తున్న మైక్రో ఫైనాన్స్‌ వ్యాపారాలు

‘జోగి ముత్యాలమ్మ. ఆమెది చీరాల వైకుంఠపురం. వయసు 67 ఏళ్లు. ఇంటి అవసరాలకు రౌడీ షీటర్‌, ఫైనాన్స్‌ వ్యాపారి చంద్రశేఖరరెడ్డి వద్ద రూ.80 వేలు విడతల వారీగా వడ్డీకి తీసుకుంది. అప్పును తీర్చేందుకు చంద్రశేఖరెడ్డి వద్దకు పలుమార్లు వెళ్లింది. ఇప్పుడు డబ్బులు వద్దు.. తర్వాత తీసుకుంటానులే.. అని సున్నితంగా తిరస్కరించేవాడు. కొద్ది రోజుల తర్వాత అసలు, వడ్డీతో కలిపి రూ.5.75 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఆమె నివాసం కానీ నగదు కానీ ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో ఆ వృద్ధురాలు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది’. దీంతో బాధితురాలిని చికిత్స కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు కావస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement