మేదరమెట్ల: కొరిశపాడు మండలం దైవాలరావూరు గ్రామంలో గల రాయిపాటి వెంకటసుబ్బయ్యకు చెందిన పొగాకు బ్యారన్ ప్రమాదవశాత్తూ మంటల్లో గురువారం దగ్ధమైంది. బ్యారన్‌లో పొగాకు కాలుస్తుండగా బ్యారన్‌లోని కర్రలు జారి పడి మంటలు వ్యాపించాయి. దీంతో బ్యారన్‌కు మంటలు వ్యాపించాయి. స్థానికులు అద్దంకి అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సమాచారం తెలియజేయడంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది మంటలు అదుపు చేశారు. పొగాకు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.4లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు.
శనగల విక్రయాలకు పేర్లు నమోదు చేసుకోండి
నరసరావుపేట: జిల్లాలో శనగ పంట వేసి ఈ క్రాప్‌లో తమ పేర్లు నమోదుచేసుకున్న రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి తమ పేర్లను సీఎం యాప్‌లో ఈనెల 15వ తేదీలోగా నమోదుచేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధనుంజయ గనోరే గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో రబీసీజన్‌లో రైతులు 20,700హెక్టార్లలో శనగ పంట వేశారని, దీని ద్వారా 16,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశామన్నారు. క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.5650గా నిర్ణయించడమైందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించదలచుకుంటే సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి తమ పేర్లను యాప్‌లో నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు.
న్యాయవాది కొలుసు సీతారాంపై దాడి హేయం
పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్
సత్తెనపల్లి: నూజివీడు న్యాయవాది కొలుసు సీతారాంపై దాడి హేయమైన చర్య అని, ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవటం దారుణమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ న్యాయవాది చిలుకా చంద్రశేఖర్ అన్నారు. న్యాయవాది కొలుసు సీతారాంపై జరిగిన దాడిని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం ఆయన ఖండించారు. ఈ సందర్భంగా చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు లెక్కచేయలేదంటే సామాన్య పౌరుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్ధమవుతుందన్నారు. న్యాయవాద చట్టాల సవరణను మేధావులు, ప్రజాస్వామిక వాదులతో కలసి పౌరసమాజం అర్థం చేసుకోకపోవటం వల్ల పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అపరిమితమైన అధికారాలు చట్ట సభలు పోలీసులకు ఇవ్వటమే ఈ పరిస్థితికి కారణమన్నారు.
పొగాకు బ్యారన్ దగ్ధం