జె.పంగులూరు: అతనికి పశువులంటే ప్రాణం..వాటికి శిక్షణ ఇవ్వడమంటే మరింత సరదా..అతని వద్ద శిక్షణ పొందిన ఎద్దులు బరిలో దిగితే బహుమతి ఖాయం..అందుకే అతని వద్ద శిక్షణ పొందిన గిత్తలంటే యమ క్రేజ్..రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఎద్దులను కొనుగోలు చేస్తుంటారు..కానీ అతనికి ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు లేదు. జె.పంగులూరు మండలం పంగులూరు గ్రామానికి చెందిన పెంట్యాల రాంబాబు 1991వ సంవత్సరం నుంచి పరుగు పందెపు ఎద్దులకు శిక్షణ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 50 జతలకు శిక్షణ ఇచ్చాడు. నాటు జాతికి చెందినవి, మైసూర్ ఎద్దులను ఎక్కువగా కొనుగోలు చేసి వాటికి శిక్షణ ఇస్తాడు. ఇతని వద్ద శిక్షణ తీసుకున్న ఎద్దుల జతలను కొనుగోలు చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఆసక్తి చూపుతారు.
పోషణ ఖర్చుతో కూడిన విషయం
పందెపు ఎద్దులను మేపాలంటే ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక జత ఎద్దులకు దాణాకి ప్రతి నెలా రూ.30 వేలు వరకు ఖర్చు అవుతుంది. ఎద్దులను శుభ్రం చేయడానికి, సమయానికి మేత వేయటానికి ఇద్దరు పనివారు కావాలి, ఒక్కొక్కరికి రూ.10 వేలు జీతం ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ఒక జత పందెపు ఎద్దులను పెంచాలంటే సూమారు రూ.5 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. అంతేకాక పందెం జరిగే ప్రాతానికి ఎద్దుల జతను తీసుకెళ్లేందుకు రవాణ ఖర్చులు చాలా ఎక్కువ. నిర్వాహకులు అందించే బహుమతులు దారి ఖర్చులకే సరిపోతాయి. ఎద్దుల పోటీలు ఎక్కువగా గ్రామాలలోనే జరుగుతాయి. వాటిని పెంచి పోషంచేది కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులే. వారికి ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తే మున్ముందు మేలైన జాతి ఎద్దులను పెంచి పోషించవచ్చు.
21సార్లు ప్రథమ స్థానం
1991 నుంచి 2017 సంవత్సరం వరకు 26 సార్లు రాంబాబు ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. 21 సార్లు ప్రథమ స్థానంలో నిలవగా, ఐదు సార్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి.
మూడు దశాబ్దాలుగా ఎద్దులకు శిక్షణ ఇస్తున్న రాంబాబు తర్ఫీదు ఇచ్చిన ఎద్దులకు మంచి గిరాకీ రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి కొనుగోలు
ఎద్దుల నిర్వహణ భారం
ప్రస్తుత కాలంలో ఎద్దుల నిర్వహణ భారం. ప్రతి నెలా రెండు జతల ఎద్దులు మేపాలంటే ఇద్దరు జీతగాళ్లు పనిచేయాలి. మొత్తం మీద నెలకు రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. వాటికి ఉలవలు దాణాగా మూడు పూటల పెట్టాలి. ఎద్దుల జతకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేడినీటితో స్నానం చేయించాలి. ప్రతి రోజూ మసాజ్ చేయాలి. అనుక్షణం జాగ్రత్తగా చూసుకోవాలి. పందేలు జరిగే ప్రాంతానికి ఎద్దులను తీసుకుపోవాలంటే రవాణా ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. ఎన్నో విజయాలను సాధించాను. సరైన గుర్తింపు లేదు.
– పెంట్యాల రాంబాబు
బరిలో దిగితే బహుమతే..