ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలి

Mar 14 2025 1:58 AM | Updated on Mar 14 2025 1:55 AM

● జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి ● పక్కా గృహాల నిర్మాణంపై సమీక్ష

బాపట్ల: పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి అన్నారు. గృహ నిర్మాణాలపై ఆ శాఖ అధికారులతో గురువారం కలెక్టర్‌ స్థానిక కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు గృహాలు మంజూరై వివిధ దశలో అసంపూర్తిగా ఉన్నటువంటి వారికి ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. జిల్లాలో సుమారు 16 వేల 85 గృహాలు నిర్మాణం నిలిచిపోయి ఉన్నాయని తెలిపారు. ఎంఎస్‌ఓలు, సీఎస్‌ఓలు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు సచివాలయ సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది జీఎస్‌డబ్ల్యూఎస్‌ వారీగా లబ్ధిదారుల గృహాలకు వెళ్లి వారితో సంప్రదించి వారి గృహాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయం గురించి వారికి తెలిపి వారిలో చైతన్యం తీసుకు వచ్చి, గృహాల నిర్మాణం పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

స్వచ్చాంధ్ర కార్యక్రమంతో పర్యావరణాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి అన్నారు. స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ వస్తువులను పూర్తిగా నిషేధించాలని చెప్పారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేదించాలని, విక్రయాలను సైతం అరికట్టాలన్నారు. భూమిలో కుళ్లిపోయే పదార్థాలను మాత్రమే వినియోగించాలని కలెక్టర్‌ చెప్పారు. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం ఒక అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని పెద్దఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈనెల 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛాంద్ర జిల్లాస్థాయి కార్యక్రమం సూర్యలంక బీచ్‌ వద్ద శనివారం ఉదయం జరుగుతుందని కలెక్టర్‌ చెప్పారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌, సీపీఓ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సామాన్యులను ఆకట్టుకునేలా మొల్ల రామాయణం

సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా మొల్ల రామాయణాన్ని రచించారని జిల్లా కలెక్టర్‌ జె. వెంకట మురళి అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో కవియిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి.జి గంగాధర్‌గౌడ్‌, జిల్లా వెనుకబడిన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, జిల్లా పౌర సంబంధాల అధికారి మోహన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement