నరసరావుపేట రూరల్: ఈతకు వెళ్లి ఇద్దకు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన మండలంలోని పెట్లూరివారిపాలెం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా కురిచేడుకు చెందిన గోపి(19) నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అద్దంకి మండలం వేంపరాలకు చెందిన తేజ్‌కుమార్(19) ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ పట్టణంలోని ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. బుధవారం సాయంత్రం గోపి, తేజ్‌కుమార్‌లు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పెట్లూరివారిపాలెం సమీపంలోని 10 ఆర్ మేజర్ కాలువలో ఈతకు వెళ్లారు. గోపి, తేజ్‌కుమార్‌లకు ఈత రాకపోయినా నీటి ప్రవాహం తక్కువుగా ఉండటంతో కాలువలో దిగారు. డ్రాప్ పైనుంచి ఇద్దరు నీటిలోకి దూకారు. డ్రాప్ కింద నీటి ఉధృతి కారణంగా మట్టి కోతకు గురై లోతు ఎక్కువుగా ఉంటుంది. దీన్ని వారు గమనించకపోడంతో ఈత రాక నీటమునిగారు. కాలువ కట్టపై ఉన్న స్నేహితులు గమనించి కేకలు వేశారు. మిర్చిపొలాల్లో కోతకు వచ్చని కూలీలు అక్కడకు చేరుకొని కాలువలోకి దిగి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కిశోర్ తెలిపారు.