
యడ్లపాడు: జాతీయ స్థాయిలో జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 9,11 తరగతుల ప్రవేశ పరీక్షలకు సంబంధించి 1,532 దరఖాస్తులు వచ్చినట్లు చిలకలూరిపేట మండలం మద్దిరాల జేఎన్‌వీ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆయా తరగతుల మిగుల సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు ఈనెల 15తో దరఖాస్తు గడువు ముగిసిందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 9వ తరగతికి 950 మంది, అలాగే 11వ తరగతికి 582 మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాలు ఇవే..
2024 ఫిబ్రవరి 10న నిర్వహించే పరీక్ష కేంద్రాలను నరసింహారావు వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణంలోని సాధినేని చౌదరయ్య పబ్లిక్ స్కూల్, శారద జెడ్పీ హైస్కూల్, ఆర్‌వీఎస్‌సీవీఎస్ హైస్కూల్, ఏఎంజీ హైస్కూల్, నవోదయ విద్యాలయా లను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు అడ్మిట్ కార్డులను ఆన్‌లైన్‌లో ఉంచుతామని, వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు.
యార్డుకు 29,271 బస్తాల మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 26,681 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 29,271 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.23,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి 24,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం క్వింటాలుకు రూ.8,500 నుంచి రూ.23,200 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.9,000 నుంచి 25,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.12,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 11,362 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 524.50 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 27,440, ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 840.70 అడుగుల వద్ద ఉంది.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద సోమవారం 2212 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 147, బ్యాంక్ కెనాల్‌కు 243, తూర్పు కెనాల్‌కు 107 , పశ్చిమ కెనాల్‌కు 47 , నిజాంపట్నం కాలువకు 243, కొమ్మమూరు కాల్వకు 733 క్యూసెక్కులు విడుదల చేశారు.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.2,800, మోడల్ ధర రూ.2,400 వరకు పలికింది.


