● గవర్నర్‌ వస్తే మార్పు వస్తుందేమో | - | Sakshi
Sakshi News home page

● గవర్నర్‌ వస్తే మార్పు వస్తుందేమో

Apr 6 2026 8:06 AM | Updated on Apr 6 2026 8:06 AM

● గవర్నర్‌ వస్తే మార్పు వస్తుందేమో

గవర్నర్‌ గది కూడా అద్దెకే

బి.కొత్తకోట: ఆంధ్రాఊటిగా పేరుగాంచిన ప్రఖ్యాత హార్సిలీహిల్స్‌లో రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్‌కు వేసవి విడిది కేంద్రం ఉంది. ఉమ్మడి రాష్ట్రం కాలం నుంచే గవర్నర్‌కు వేసవి విడిది కేంద్రంగా గుర్తించగా ఎందరో గవర్నర్లు ఇక్కడ విడిదిచేశారు. ప్రథమ పౌరుడి పేరుతో ఉన్న ఈ అతిథిగృహం సకల సౌకర్యాలతో అలరారుతూ ఉంటుందనుకుంటే ‘ఘోస్ట్‌’ హౌస్‌లో అడుగుపెట్టినట్లే. ఈ అతిథి గృహం పర్యాటకశాఖ చేతికి వెళ్లాక నిర్వహణ దరిద్రంగా తయారైంది. ప్రస్తుతం ఈ భవనాన్ని చూస్తే ఇది గవర్నర్‌ విడిదిచేసే బంగ్లానా అని ఆశ్చర్యపోక తప్పదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని హార్సిలీహిల్స్‌ గవర్నర్‌తో పాటు సామాన్యులకు వేసవి విడిది కేంద్రం.

1962లో గవర్నర్‌ బంగ్లా

రాష్ట్రపతికి విడిది కేంద్రం ఉన్నట్టుగా గవర్నర్‌కు వేసవి విడిది కేంద్రం ఉండాలని 1961లో హార్సిలీహిల్స్‌పై అప్పటి ప్రభుత్వం గవర్నర్‌ బంగ్లా నిర్మాణం చేపట్టి ఏడాదిలో పూర్తి చేసింది. అప్పటినుంచి వేసవిలో గవర్నర్లు ఇక్కడికి వచ్చి విడిదిచేసి వెళ్తుంటారు. వారిలో కుముద్‌బెన్‌జోషి, కృష్ణకాంత్‌, రంగరాజన్‌, నరసింహన్‌ ఇలా గవర్నర్లు ఇక్కడ విడిది చేశారు. మాజీ ప్రధాని ఐకే.గుజ్రాల్‌, సీఎం హోదాలో నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తదితరులు ఈ బంగ్లాలోనే విడిది చేయగా ఇక్కడ విడిదిచేసిన మంత్రుల సంఖ్యకు లెక్కలేదు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ బంగ్లాలో విడిది చేసేందుకు అత్యున్నత స్థాయి వ్యక్తు లు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి గవర్నర్‌ బంగ్లా ఇప్పుడు భూత్‌ బంగ్లాగా మారిపోయింది.

బంగ్లా ఇలా మారిపోయింది

గవర్నర్‌ బంగ్లా పైకప్పంతా వర్షానికి ఉరుస్తోంది. నీళ్లు చుక్కచుక్కలుగా కారుతూ అతిథిగృహాల డోర్లు తడిసి బుడపలు కట్టాయి. డోర్లపై అతికించిన షీట్లు దెబ్బతిన్నాయి. శ్లాబుపైన పెచ్చులూడిపోతున్నాయి. విద్యుత్‌ సరఫరా వైర్లు కాలిపోయి నల్లగా మాసిబారింది. గోడలపై కారిన వర్షపునీటితో మట్టిపెళ్లలు ఊడినట్టుగా ఉన్నాయి. గోడలకు అతికించిన అట్టషీట్లు ఊడిపోతున్నాయి. రంగులు పూర్తిగా వెలసిపోయాయి. గోడలపై మచ్చలు, చారలు దర్శనమిస్తున్నాయి. హార్సిలీసూట్‌ డోర్‌, గోడలది ఇదే పరిస్థితి. వర్షం కురిసేటప్పుడు ముట్టుకుంటే విద్యుత్‌ షాక్‌ కొడుతుందని టూరిజం సిబ్బంది భయపడుతున్నారు. ఇలా మారిపోయిన గవర్నర్‌ బంగ్లాలో పర్యాటకశాఖ సందర్శకులకు గదులు కేటాయిస్తూ ఆదాయం ఆర్జిస్తోంది.

వేసవి విడది కేంద్రంగా హార్సిలీహిల్స్‌పై గవర్నర్‌ కోసం బంగ్లా నిర్మించి, వారు విడిది చేసినప్పుడు సేవకుల కోసం ప్రత్యేక క్వార్టర్లు, ఇళ్లను నిర్మించారు. అయితే రహదారి భవనాలశాఖ ఆధీనంలోని ఈ బంగ్లాను పర్యాటకశాఖకు అప్పగించడంతో పూర్తి వాణిజ్యపరంగా మారిపోయింది. గవర్నర్‌ కోసం ఏర్పాటుచేసిన డైనింగ్‌హాల్‌, విజిటర్స్‌ హాలు, మీటింగ్‌ హాలు ఇవన్ని తొలగించి గదులుగా చేసి అద్దెకు ఇస్తున్నారు. ఒకప్పుడు బంగ్లా మొత్తం గవర్నర్‌ కోసమే ఉండగా ఇప్పుడు కేవలం గవర్నర్‌ సూట్‌ అని పిలుచుకునే ఒక గదిని మాత్రమే ఆయన పేరుతో కేటాయించారు. ఇదికూడా గవర్నర్‌ పేరుకు మాత్రమే. మంత్రులు, ప్రభుత్వస్థాయి అధికారులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు వస్తే వారికి కేటాయిస్తున్నారు. పేరుకు గవర్నర్‌ బంగ్లానే మిగిలిపోయింది. ఆ పేరుకు కనీస గౌరవం కూడా లేదు.

భూత్‌ బంగ్లాను తలపిస్తున్న గవర్నర్‌ గెస్ట్‌ హౌస్‌!

వర్షానికి లీకేజీలతోపాచికట్టిన గోడలు, డోర్లు

గోడలపై బూజు పట్టినాదులిపే దిక్కులేదు

నరసింహన్‌ తర్వాత గవర్నర్లు ఇక్కడికి రాలేదు. దాంతో పర్యాటకశాఖ గవర్నర్‌ బంగ్లాను పూర్తిగా ఆదాయ వనరుగా చూస్తోంది. పాత డిజైన్‌ ఎంతో చక్కగా ఉండేది. వాణిజ్య అవసరంగా గుర్తించడంతో ప్రభుత్వ అనుమతి లేకుండానే పర్యాటకశాఖ అధికారులు ఇష్టమొచ్చినట్టు మార్పులు చేసుకుంటున్నారు. లక్షల ఆదాయం పొందుతున్నా గవర్నర్‌ గౌరవార్థం తీసుకున్న చర్య ఒక్కటిలేదు. గవర్నర్‌ బంగ్లా పేరుతో పర్యాటకశాఖ వ్యాపారం చేసుకుంటోంది. ఈ బంగ్లాలో 1965 నుంచి సినిమా షూటింగులు జరిగాయి.దీన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం, ఉన్నతస్థాయి అధికారులు పట్టించుకోకపోవడం ఈ దుస్థితికి కారణమైంది. మరి ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బంగ్లాను బాగు చేస్తారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement