మదనపల్లె టౌన్ : మదనపల్లె తాలూకా పోలీసులు ఆదివారం బైక్ రేసర్లతో పాటు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు .. స్థానిక జగన్ కాలనీలో ఉంటున్న మైనర్ బాలుడు దీక్షిత్ స్థానిక బైక్ రేసర్లు శనివారం ఢీకొట్టడంతో కాలు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వార్తను ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైంది. బాలుని తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆదివారం బైక్ రేసర్లతో పాటు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
యువతి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : ఎలుకల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి సంఘటన ఆదివారం కురబల కోట మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. అంగళ్లుకు చెందిన సి.హేమలత (29) మదనపల్లెలోని ఓ స్వచ్ఛంద సంస్థలో గత కొన్నేళ్లుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో ఇంటి పట్టునే ఉన్న హేమలతకు ఏం కష్టం వచ్చిందో ఏమో..! తాను ఉంటున్న ఇంట్లోనే ఎలుకల మందు తాగింది. కుటుంబీకులు గమనించి బాధితురాలినికి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం ఆమెను తిరుపతికి తీసుకెళ్లాలని సూచించారు. కేసు దర్యాప్తులో ఉందని, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదని ముదివేడు పోలీసులు తెలిపారు.


