క్షణికావేశం.. చిన్నాభిన్నం | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశం.. చిన్నాభిన్నం

Apr 6 2026 7:30 AM | Updated on Apr 6 2026 7:30 AM

అప్పుల ఊబిలో చుక్కుకుని ఛిద్రమైన కుటుంబం

గాలివీడు : క్షణికావేశంతో తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అప్పుల భారంతో మనస్తాపానికి గురైన దంపతులు తీసుకున్న ఆత్మహత్య నిర్ణయం రెండు ప్రాణాలను బలి తీసుకోగా, ఇద్దరు అమాయక చిన్నారులను అనాథలుగా మార్చింది. ఈ ఘటన గాలివీడు పట్టణంలో విషాదాన్ని నింపింది. శెట్టివారిపల్లెకు చెందిన మారువేణి మల్లికార్జున (35), ఆయన భార్య రాణి దంపతులకు ఐదేళ్ల జాన్వీ, మూడు నెలల చిన్నారి ఉన్నారు. మల్లికార్జున ఓ ప్రైవేట్‌ హౌసింగ్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదట సాఫీగా సాగిన జీవితం, కుటుంబ అవసరాల పెరుగుదలతో ఆర్థిక ఒత్తిళ్లు అధికమయ్యాయి. అవసరాల కోసం తీసుకున్న అప్పులు క్రమంగా పెరుగుతూ, వాటి మీద వడ్డీలు భారంగా మారాయి. ఒకవైపు అప్పు తీర్చేందుకు మరొక అప్పు తీసుకోవడం, మరోవైపు అధిక వడ్డీలతో అవస్థలు ఏర్పడ్డాయి. చివరికి వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 3వ తేదీ రాత్రి విషద్రావణం తాగారు. వెంటనే వారిని కడప, కర్నూలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించినప్పటికీ, ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో లిద్దరూ విగతజీవులుగా పడివున్న తల్లిదండ్రులను చిన్నారులు విలపించారు. ఏమి జరిగిందో అర్థం కాని ఆ పసిపాపల పరిస్థితి ప్రతి ఒక్కరినీ కదిలించింది. వారిని ఎవరు చూసుకుంటారు? వారి విద్య, భవిష్యత్తు ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు సమాజం ముందున్నాయి. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, అనాథలుగా మిగిలిన చిన్నారులకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేయాలని గ్రామస్తులు, మానవతావాదులు కోరుతున్నారు. మనస్తాపంలో తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం ఎన్నో జీవితాలను చీకటిలోకి నెట్టేస్తుందని ఈ ఘటన మళ్లీ గుర్తుచేసింది.

భాదతప్త హృదయాలతో అంత్యక్రియలు

ఆత్మహత్య చేసుకున్న మారువేణి మల్లికార్జున, ఆయన భార్య రాణి మృతదేహాలు మండల కేంద్రమైన శెట్టివారిపల్లెకు చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బోరున విలపించారు. బాధాతప్త హృదయంతో భార్యభర్తల అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement