మదనపల్లె టౌన్ : మదనపల్లె రెవెన్యూ కార్యాలయ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఓ రహస్య వ్యక్తి జిల్లా కలెక్టర్, సీసీఎల్‌ఏకు చేసిన ఫిర్యాదు కాపీ ఆదివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వీఆర్‌ఓ మధ్యవర్తిగా రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయని, ఓ వ్యక్తి వద్ద రూ.ఐదు లక్షలు బ్యాంకు ఖాతాకు జమ చేయించుకున్నారని.. సంబంధించిన పత్రాలు ఫిర్యాదు కాపీలో ఉన్నాయి. భూమి లావాదేవీలు, విధులకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేసినట్లు అందులో ఉన్నాయి. అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలపై విచారణ జరిపి సంబంధిత అధికారిపై క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్ చేయాలని అందులో కోరారు. ఈ ఫిర్యాదు కాపి వ్యవహరాం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. దీన్ని ఎవరు ఫిర్యాదు చేశారు. అన్నది పేరు లేదు. విజిల్ బ్లోయర్ పేరుతో ఫిర్యాదు పంపారు.
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి
ముద్దనూరు : మండలంలోని పెద్దదుద్యాల గ్రామ సమీపంలో ఆదివారం ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ క్రింద పడి డ్రైవరు శ్రీనివాసులు(44) దుర్మరణం చెందాడు.ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సమాచారం మేరకు ముద్దనూరులోని యానాది కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు తన కుటుంబంతో కలిసి సుంకేసుల, పెద్దదుద్యాల గ్రామాల్లో తాడిపత్రికి చెందిన వ్యక్తి పొలాల్లో పనిచేస్తున్నాడు.ఆదివారం సాయంత్రం సుంకేసుల నుంచి పెద్దదుద్యాలలోని పొలంలోకి ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్నాడు.ప్రధాన రహదారి నుంచి పక్కకు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోయింది.ఈ ప్రమాదంలో శ్రీనివాసులు ట్రాక్టర్ క్రింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉప్పుగుంటపల్లెలో
పురాతన విగ్రహం
మైదుకూరు : వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఉప్పుగుంటపల్లెలో ఆదివారం పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి అబ్బిరెడ్డి వారసుల పొలాల వద్ద ఈ విగ్రహంతోపాటు నాగుల విగ్రహాలు వెలుగు చూశాయి. పెద్దిరెడ్డి అబ్బిరెడ్డి కుటుంబీకులు పూజలు నిర్వహిస్తూ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీసే పుట్ట శనివారం కుంగడాన్ని గమనించారు. ఈ విషయాన్ని దువ్వూరు మండలం జొన్నవరం రామాలయం పూజారికి తెలపగా, తవ్వకాలు జరపకుండా ఆ ప్రాంతాన్ని నీటితో నింపాలని సూచించినట్టు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్దిరెడ్డి దశరథరామిరెడ్డి తెలిపారు. తాము ఆ విధంగా చేయడంతో మట్టి కరిగి తొలగిపోయి అమ్మవారి విగ్రహం నాగులు విగ్రహాలు బయటపడ్డాయని వివరించారు. ఈ విషయాన్ని మైదుకూరుకు చెందిన ఔత్సాహిక చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్‌కు తెలిపామని ఫొటోలను పంపామని తెలిపారు. ఆయన బయటపడిన విగ్రహం చాముండి విగ్రహం అని, 17వ శతాబ్దానికి చెందినదై ఉండవచ్చని తెలిపారన్నారు. అమ్మవారి విగ్రహం బయటపడిన విషయాన్ని అమెరికాలో ఉంటున్న తమ బంధువులకు తెలియజేశామని దశరథరామిరెడ్డి తెలిపారు.


