చౌడేపల్లె : మండల కేంద్రంలో వెలసిన శ్రీ నడివీధి గంగమ్మ జాతర ఈ నెల 7, 8వ తేదీల్లో జరుగనుంది. ఈ మేరకు జాతర నిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు అనంతరం అమ్మవారికి చాకలివారి ఇంట కల్యాణోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా లో జరిగే గంగజాతరలో చౌడేపల్లె జాతరలోనే కల్యాణోత్సవం జరగడం విశేషం. గ్రామంలో గత రెండు రోజులుగా దున్నపోతుకు ప్రతి ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వీధుల్లో ఊరేగిస్తున్నారు.గ్రామపెద్దలు తెలిపిన ప్రకారం అమ్మవారి జాతర ప్రారంభానికి ముందు సంప్రదాయ ప్రకారం సారె గంపను తీసుకెళ్లి నాయునివారి పాళ్యంలో ఉన్న శిలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం జాతర మొదలవుతుంది. కుమ్మర వీధికి చెందిన వెంకటరమణ ఇంట్లో అమ్మవారిని పెళ్లికుమార్తెను చేసి పురవీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి చాకల వీధిలోని మడివిలిరాజు ఇంట మడవిలి రాజుతో వైభవంగా కల్యాణోత్సవం జరుగుతుంది. అమ్మవారిని తీసుకెళ్లి నడివీధిలో కొలువుతీర్చి బెస్తవాని ఇంటి నుంచి ఏర్పాటు చేసిన గట్టం కుంటలను తీసుకొచ్చి సమర్పిస్తారు. అనంతరం నల్ల గంగమ్మ, మారెమ్మ, బోయకొండ గంగమ్మ, గ్రామదేవత అయిన చౌడేశ్వరీ దేవీలకు పట్టణ మహిళలు పిండిదీపాలతో ఆరాధన చేసి మొక్కులు చెల్లిస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.


