● వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి
● మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష
కడప కార్పొరేషన్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) సర్వేతో చాలా ప్రమాదం పొంచి ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం నగర పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సర్వే జరిగిన 12 రాష్ట్రాల్లో లక్షల ఓట్లను తొలగించారని, ప్రక్కనున్న తమిళనాడులో 93లక్షల ఓట్లు తొలగించారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి భరించలేక ఉత్తరప్రదేశ్‌లో 7 మంది బీఎల్‌ఓలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. 24 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం జరగలేదన్నారు. డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్లను ఇందులో తొలగిస్తారన్నారు. ఈనెల 15వ తేది నుంచి రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశముందని, లేదా కొంత జాప్యం జరగవచ్చన్నారు. ఉద్యోగ నిమిత్తం వేరే చోట ఉన్నవారు, విదేశాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా జరగాలంటే సమర్థులైన వారిని బీఎల్‌ఏలుగా నియమించుకోవాలన్నారు. బీఎల్‌ఓలతోపాటు వైఎస్సార్‌సీపీ నియమించిన బీఎల్‌ఏలు కూడా ఈ వెరిఫికేషన్‌లో పాల్గొంటే ఉపయోగముంటుందని తెలిపారు.


