సంక్షేమ సారథి
సాక్షి రాయచోటి : రాజు బాగుంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుందనేది నానుడి. అందుకు తగ్గట్టుగానే వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ పాలన సాగింది. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది.
‘అన్నమయ్య’లో అపార అభివృద్ధి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లాను పురోగతిబాట పట్టించింది. ప్రధానంగా జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేట పార్లమెంటును జిల్లాగా మార్చి జిల్లా కేంద్రంగా రాయచోటిని ఎంపిక చేశారు. అంతకుమునుపు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాకుండా ప్రత్యేకంగా వారిని కంటికిరెప్పలా ప్రభుత్వం కాపాడుకుంది. మరోపక్క అంతే వేగంగా జిల్లాను అభివృద్ధి చేసింది.
● ప్రధానంగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో రూ. 25 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, వెలిగల్లు ప్రాజెక్టు నుంచి రాయచోటి ప్రజల దాహార్తి తీర్చేందుకు రెండవ పైపులైన్ కోసం రూ.100 కోట్లు కేటాయించగా ఇప్పటికీ పనులు జరుగుతున్నాయి. రాయచోటిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి సుమారు రూ. 100 కోట్లు కేటాయించారు. రూ. 8 కోట్లతో శిల్పారామం, కేంద్రీయ విద్యాలయం, పీజీ కళాశాల, మరో రూ. 3 కోట్లతో నగరవనం, క్రికెట్ స్టేడియం, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి 50 ఎకరాల్లో ఎంఐజీ లే అవుట్, డబల్‌రోడ్డు నిర్మాణాలు, మున్సిపాలిటీ పరిధిలో పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు, నూతనంగా ఆర్టీసీ బస్టాండు, రైతు బజారు, సర్కిళ్లు, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, టౌన్ పోలీసుస్టేషన్, డీఎస్పీ కార్యాలయం, ఇంకా అనేక రకాల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
● మదనపల్లెలో రూ. 500 కోట్లతో మెడికల్ కళాశాల హైలెట్‌గా నిర్మాణాలు కొనసాగాయి. కేంద్రీయ విద్యాలయం, మదనపల్లె వాసుల ఎన్నో ఏళ్ల కలగా ఉన్న బీటీ కళాశాలను యూనివర్శిటీ స్థాయికి తీసుకెళ్లడం, సుమారు రూ. 200 కోట్లతో గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధితోపాటు ఇతర అనేక విధాలుగా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టారు.
● తంబళ్లపల్లె నియోజకవర్గంలోనూ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. పీలేరులో కూడా రూ. 24 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, పీలేరు–తిరుపతి జాతీయ రహదారి నిర్మాణ పనులు వందలాది కోట్లతో, రైల్వేకోడూరు పరిధిలో రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జిలు, చిట్వేలి–రైల్వేకోడూరు ఫోర్‌లేన్‌రోడ్డు, రాజంపేట పరిధిలో రూ. 80 కోట్లతో పింఛా ప్రాజెక్టును దాదాపుగా పూర్తి చేశారు.
డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా భారీగా లబ్ధి
అన్నమయ్య జిల్లాలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా సుమారు రూ. 9,450 కోట్ల మేర లబ్ధి చేకూరింది. అనేక రకాల పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించారు. ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ. 1500 కోట్ల మేర ప్రయోజనం ఒనగూరింది. పేద, మధ్యతరగతి, ఇతర తారతమ్యాలు చూడకుండా పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించారు.
ఊర్లు మారిపోయాయి
జిల్లా వ్యాప్తంగా 525కు పైగా లే అవుట్లలో 75 వేల గృహాలకు సంబంధించి నిర్మాణాలు చేపడితే అందులో వేలాది గృహాలు పూర్తయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ కొత్త ఊర్లు ఆవిర్భవించాయి. ఇంటి నిర్మాణాలతో నూతన శోభ సంతరించుకుంది.
జిల్లాలో డీబీటీ, నాన్ డీబీటీ కింద
రూ. 9,450 కోట్లకు పైగా లబ్ధి
పునర్విభజనతో జిల్లాలో అభివృద్ధి పరుగులు
జిల్లా కేంద్రం రాయచోటిలో
అన్ని రకాలుగా పురోభివృద్ధి
మదనపల్లెలో తలమానికంగా
రూ. 500 కోట్లతో మెడికల్ కళాశాల
నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు
జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు పార్టీ పిలుపు


