శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్ లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్ కి పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్ కి సమర్పించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, బంగారు ఆభరాణాలు వేసి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
నేడు క్రికెట్, త్రోబాల్ పోటీలు
మదనపల్లె సిటీ : జిల్లా స్థాయిలో టీచర్స్‌కు క్రికెట్, త్రోబాల్ పోటీలు ఆదివారం నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శులు నాగరాజు, ఝాన్సీరాణి తెలిపారు. రాయచోటిలోని నక్కలపల్లి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అఽథారిటీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుందన్నారు. క్రికెట్, త్రోబాల్ పోటీల్లో డివిజన్ స్థాయిలో విజేతలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రికెట్ క్రీడాకారులు తమ వెంట సొంత స్పోర్ట్స్ కిట్,అబ్డామిన్ పరికరాలు, త్రోబాల్‌కు వచ్చే క్రీడాకారులు తమ వెంట సొంత క్రీడాదుస్తులు, త్రోబాల్‌ను తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు ముగిసిన తర్వాత మూడు డివిజన్ల నుంచి ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి జిల్లా జట్టుకు ఎంపిక జరుగుతుందన్నారు.


