ఉద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వం
రాయచోటి టౌన్ : ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 12వ పీఆర్‌సీ, ఐఆర్, డీఏలు సకాలంలో ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం దగా చేయడమేనని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి ఆరోపించారు. ఆదివారం రాయచోటి పట్టణంలో ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (పీఎస్‌టీయూ)ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే సీపీఎస్ విధానాన్ని సమీక్షించి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తామని చెప్పి 10–14వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పీఎస్‌టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పీసీ రెడ్డెన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఇలియాస్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పురుషోత్తమరెడ్డి, రామాంజనేయరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్. మునిరెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు పీవీ సుబ్బారెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చెన్నుపల్లె ఓబుల్‌రెడ్డి, మైనార్టీ కన్వీనర్ లియాఱత్, ఆర్థిక కార్యదర్శి వెంకట సుబ్బయ్య, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


