వీడిన మదనపల్లి మర్డర్ మిస్టరీ
● పక్కా పథకం ప్రకారమే హత్య
● చంద్రగిరిలో నాటు వైద్యం చేయాలంటూ తీసుకొచ్చిన నిందుతులు
● తోటలో గొంతు నులిమి చంపేసిన వైనం
● మదనపల్లి రూరల్ సీఐ వివరాలు వెల్లడి
చంద్రగిరి : అదృశ్యమైన వ్యక్తి కేసును ఎట్టకేలకు మదనపల్లి రూరల్ పోలీసులు ఛేదించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద కేసు నమోదు చేసి, చివరకు మర్డర్ మిస్టరీకి తెరపడింది. తన భర్త అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ మృతురాలి భార్య విజయలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. తన భర్త మృతదేహం కోసం ఆమె 10 రోజులుగా పోలీసుల చుట్టూ తిరుతూనే ఉంది. ఈ క్రమంలో శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘నా భర్త అస్థికలైనా ఇవ్వండయ్యా’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. కథనంపై స్పందించిన పోలీసులు శుక్రవారం నిందుతులతో కలసి చంద్రగిరిలోని ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ రామాపురానికి చెందిన ఆవులపల్లె నరసింహులు(40) వ్యవసాయంతోపాటు నాటు వైద్యం చేసేవాడు. నరసింహులు కురబలకోట మండలానికి చెందిన నాగరాజు, అతని స్నేహితుడు నారాయణ స్వామి, కత్తి నరసింహులతో కలసి తిరిగేవాడు. ఈ క్రమంలో నాగరాజు ఇంటికి నరసింహులు పలుమార్లు వస్తూ వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇంట్లో తన భార్యతో నరసింహులు చనువుగా ఉండటంతో వారిపై నాగరాజు అనుమానించాడు. ఈ నేపథ్యంలో నరసింహులిని హతమార్చాలని నాగరాజు పథకం రచించాడు. దీంతో అక్టోబర్ 27వ తేదీన చంద్రగిరిలో నాటువైద్యం అందించాలని నాగరాజు.. ఆవులపల్లె నరసింహులుకు తెలిపాడని సీఐ పేర్కొన్నారు. అనంతరం నరసింహులుతోపాటు నారాయణస్వామిలు బస్సులో శ్రీనివాసమంగాపురానికి చేరుకున్నారన్నారు. అక్కడ సిద్ధంగా ఉన్న నాగరాజు బంధువు మునిరాజ వారిద్దరిని తన ద్విచక్ర వాహనంలో నరసింగాపురం సమీపంలోని ఓ మామిడితోటలోకి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నాగరాజు అక్కడికి చేరుకున్నారని వివరించారు.
కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి హత్య
మామిడితోటకు ఆవులపల్లె నరసింహులు రాగానే నాగరాజుతోపాటు నారాయణ స్వామి, కత్తి నరసింహులు కలసి కాళ్లు చేతులు కట్టేసి కేకలు వేయకుండా ప్లాస్టర్‌తో నోటిని మూసివేశారన్నారు. అనంతరం ఆవులపల్లె నరసింహులు మెడకు తాడును బిగించి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. అనంతరం మృతుడిని మామిడితోటలోని సుమారు నాలుగు అడుగుల మేర గోతిని తవ్వి పూడ్చివేసినట్లు ఆయన వివరించారు. మృతుడి భార్య విజయలక్ష్మీ ఫిర్యాదుతో ఈ నెల 3వ తేదీన కేసు నమోదు చేసి విచారణలో అసలు వాస్తవాలు బయటపడినట్టు తెలిపారు. అనంతరం తహసీల్దార్ శివరామసుబ్బయ్య సమక్షంలో సుమారు గంట పాటు శ్రమించి గోతిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీసి, శవ పంచనామా నిర్వహించారు. అనంతరం అక్కడే పంచనామా నిర్వహించి, మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు నిందుతులను అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసులో మరికొంత మంది అనుమానితులను విచారించాల్సి ఉందని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, నలుగురు నిందుతులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు.
వీడిన మదనపల్లి మర్డర్ మిస్టరీ
వీడిన మదనపల్లి మర్డర్ మిస్టరీ


