వాటర్ ప్లాంట్‌లోకి దూసుకెళ్లిన లారీ
రైల్వేకోడూరు : రైల్వేకోడూరు మండలం అనంతరాజపేట ప్రధాన రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున లారీ బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి లారీ అదుపు తప్పి ప్రధాన రహదారి పక్కనున్న వాటర్‌ప్లాంట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో పైకప్పు కూలిపోయింది. అక్కడే పార్కింగ్ చేసి ఉన్న ఆటో నుజ్జునుజ్జు అయింది. రాత్రి వేళ ఎవరూ లేక పోవడంతో ప్రాణనష్టం జరగలేదు.
దాడి చేసిన వారిపై
కేసు నమోదు
గాలివీడు : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు వీఆర్‌ఏ లపై దాడి చేసిన ఘటనలో కొండ్రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. గురువారం రెవెన్యూ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని మద్యం మత్తులో దుర్భాషలాడుతూ వారి సెల్ఫోన్లను బద్దలుకొట్టాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుల ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కారు ఢీకొని మహిళ మృతి
పీలేరు రూరల్ : కారు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని వేపులబైలు పంచాయతీ కంచెంవారిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. సదుం మండలం ఊటుపల్లె పంచాయతీ మర్రిమాకులపల్లెకు చెందిన కె.ద్వారకనాథనాయుడు భార్య కె. వనజ (40) శుక్రవారం పీలేరుకు వెళ్లడానికి కంచెంవారిపల్లె వద్ద హైవే రోడ్డు దాటుతుండగా కలికిరి నుంచి ఏపీ 04ఏఏ 0090 నంబరు గల కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వనజ అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.
వాటర్ ప్లాంట్‌లోకి దూసుకెళ్లిన లారీ


