ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి
సిద్దవటం : సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు అన్నమయ్య జిల్లాలో కలపడం తగదని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. సిద్దవటం తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మూడో రోజైన శుక్రవారం మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అలాగే మాధవరం–1, భాకరాపేట ప్రాంతాల్లో చేపట్టిన దీక్షలను సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దవటంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాకు విలీనం చేయడం తగదని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ రెండు మండలాలను వైఎస్‌ఆర్ కడప జిల్లాలో పెట్టేందుకు కృషి చేశామని తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీలు పని చేయాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేయకూడదన్నారు. జిల్లా కేంద్రమైన రాయచోటి ఈ రెండు మండలాలకు 85 కిలోమీటర్లలో ఉందని, కడప 10 కిలోమీటర్ల పరిధిలో ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలకు అనువైన ప్రాంతంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించామని తెలిపారు. సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలో ఉంచామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రెండు మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపిందని, వాటిని కడప జిల్లాలోనే ఉంచాలనే చేపట్టే రిలే నిరాహార దీక్షలకు వైఎస్‌ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. అనంతరం దీక్షలు చేస్తున్న మహిళలకు ఎమ్మెల్యే కొబ్బరిబోండాలు ఇచ్చి దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నేతలు నారాయణ, రాజగోపాల్ అయ్యా, నీలకంఠారెడ్డి, అనసూయదేవి, నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, బాలుగారు సుబ్బయ్య, రాజేష్, సయ్యద్ నూర్, గోపాల్‌స్వామి, పోలు వెంకటసుబ్బయ్య, కె.అనిల్‌కుమార్‌రెడ్డి, నరసింహారావు, కె.పెంచలయ్య, కృష్ణచైతన్య, కేవీ సుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ జిల్లాలోనే
సిద్దవటం, ఒంటిమిట్ట ఉండాలి
రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి


