పోలీసుల తీరుపై మండిపడ్డ మృతుడి కుటుంబీకులు
● వినీత్‌ను చంపిన వారిని శిక్షించాలని డిమాండ్
● డీఎస్పీ హామీతో శాంతించిన బాధితులు
కలికిరి : కలికిరి పట్టణంలోని అబు మొబైల్‌లో పని చేస్తున్న ముంగర వినీత్‌కుమార్ రాజు(25) అత్యంత కిరాతకంగా హత్యకు గురైనట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినా.. పోలీసుల తీరు నిర్లక్ష్యంగా ఉందని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్ ముందు పడిగాపులు కాసినా తమ నుంచి ఫిర్యాదు తీసుకోలేదని.. శనివారం రాత్రి పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైటాయించడంతో ఎట్టకేలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం తాము ఫిర్యాదులో పేర్కొన్న విధంగా నిందితుల పూర్తి వివరాలు.. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసేది లేదని ప్రభుత్వాసుపత్రి మార్చురీ ముందు ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళన సమాచారంతో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ క్రిష్ణమోహన్, పీలేరు సీఐ యుగంధర్ ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిందితులైన మొబైల్ షాపు యజమాని అబుబకర్, నౌషాద్ బాషా(బబ్లూ), అహ్మద్, నరేష్‌లపై హత్య కేసు నమోదు చేయడం జరిగిందని, పూర్తి వివరాలతో నిందితులను కోర్టుకు తరలించి చట్టం ప్రకారం శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు వినీత్‌కుమార్ రాజు మృతదేహాన్ని తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా డీఎస్పీ క్రిష్ణమోహన్, సీఐలు యుగంధర్, అనీల్‌కుమార్ సత్యాపురంలోని సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీంతో కలిసి పరిశీలించారు.
పోలీసుల తీరుపై మండిపడ్డ మృతుడి కుటుంబీకులు


