ప్రిన్సిపల్స్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం
జోన్–4 అధ్యక్షుడిగా త్రివిక్రమరెడ్డి ఎన్నిక
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి ఎన్నికలు ఆదివారం విజయవాడలోని ఏపీ ఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించారు. అసోసియేషన్ ప్రోటెం రాష్ట్ర అధ్యక్షుడు డా. గోపాల్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రిన్సిపల్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనపర్తి త్రివిక్రమరెడ్డి జోన్–4 (రాయలసీమ ప్రాంతం) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ ఎన్నికల పరిశీలకుడిగా పర్యవేక్షించారు. ఏఎస్ రామకృష్ణ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర విద్యా వ్యవస్థలో కీలకమైన భూమిక పోషిస్తోందన్నారు. కొత్తగా ఎన్నుకోబడిన జోన్–4 అధ్యక్షుడు త్రివిక్రమరెడ్డి నేతృత్వంలో రాయలసీమ ప్రాంతంలో విద్యా రంగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి విచ్చేసిన అనేకమంది ప్రిన్సిపాల్స్, అద్యాపకులు అసోసియేషన్ సభ్యులు త్రివిక్రమరెడ్డి ఎన్నికపై శుభాకాంక్షలు తెలియజేశారు. జోన్ –4 అధ్యక్షుడిగా ఎన్నికై న త్రివిక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ, ప్రిన్సిపాల్స్ సమస్యల కోసం కృషి చేస్తానని తెలిపారు.


