కిడ్నీ రాకెట్ నిందితులకు రిమాండ్
మదనపల్లె : స్థానిక గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చట్ట విరుద్ధంగా వైజాగ్‌కు చెందిన సాడి యమున (29) శరీరం నుంచి ఒక కిడ్నీ తీసి మరొకరికి అమర్చిన తర్వాత యమున మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులకు ఆదివారం న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితులైన డాక్టర్ కంప ఆంజనేయులు (61), సూరిబాబు (45) కాకర్ల సత్య (43), పిల్లి పద్మ (45), మెహరాజ్ (37), బాలరంగడు (35)లను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆదివారం టూటౌన్ సీఐ రాజారెడ్డి ప్రక్రియను చేపట్టారు. భారీ భద్రత నడుమ నిందితులను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అందరికీ వైద్యులు వైద్యపరీక్షలను నిర్వహించారు. ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలు అందాక వారిని ఆస్పత్రి నుంచి తిరిగి స్థానిక న్యాయమూర్తి ఎదుట హజరుపర్చగా రిమాండ్‌కు ఆదేశించారు.
నేటినుంచి
టీచ్ టూల్ లెవల్ –2 ట్రైనింగ్
రాయచోటి టౌన్ : ఈ నెల 17,18వ తేదీల్లో టీచ్ టూల్ లెవల్–2 ట్రైనింగ్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి, అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. 30 మండలాల్లో ఉన్న 597 మంది ఉపాధ్యాయులకు ఆయా మండల కేంద్రాల్లోని విద్యాశాఖ కార్యాలయాల్లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తరగతి గదలో విద్యార్థులు ఆకర్షితులయ్యే విధంగా బోధన పద్ధతులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.తరగతి గదిలో ఉపాధ్యాయుడు వివరిస్తున్న అంశాలను విద్యార్థులు ఎంత వరకు అర్థం చేసుకొంటున్నారనే విషయాలపై పరిశీలన జరుగుతుందని చెప్పారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
రాయచోటి : ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 17వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గంగమ్మకు బోనాలు
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీ అనంతపురం గంగమ్మ దేవత అమ్మవారికి ఆదివారం భక్తులు బోనాలు సమర్పించి తలనీలాలు అర్పించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్
ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. అలాగు వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు 91333 31912కు చాట్ చేయడం ద్వారా కూడా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.
కిడ్నీ రాకెట్ నిందితులకు రిమాండ్


