కొండెక్కిన కొబ్బరికాయ
మదనపల్లె సిటీ : ఆలయాలకు వెళ్లే భక్తులు తమ కోర్కెలు తీర్చాలని దేవుళ్లకు కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటారు. అనుకున్నవి తీరితే మరోసారి వెళ్లి వీటిని కొట్టి దర్శనం చేసుకుని వస్తుంటారు. అధ్యాత్మిక చింతనలో లక్షల మంది భక్తులు నిత్యం ఆలయాలకు వెళ్తుంటారు. కానీ దేవుడికి ఇష్టమైన కొబ్బరికాయ ధర చుక్కలు చూపిస్తుండటంతో భక్తులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో 6(ఎ)–2 ఆలయాలు 2, 6 (బి)–2 13, 6(సి)1 29, 6(సి) 1604, 6 (డి)–2 ఆలయాలు ఉన్నాయి. వీటితో పాటు దేవదాయశాఖ పరిధిలోకి రాని ఆలయాలు కూడా ఉన్నాయి. 2023లో రూ.15 ఉన్న కొబ్బరికాయ ధర 2024 నాటికి రూ.25 చేరింది. ప్రస్తుతం ధర అమాత పెరిగి రెడింతలు అయింది. సాధారణ రోజుల్లో రూ.35 విక్రయిస్తుంటే పండుగ, ప్రత్యేక రోజుల్లో రూ.50కి విక్రయిస్తున్నారు. ఇక ఆలయాల వద్ద కొబ్బరికాయల విక్రయ నిర్వహణను వేలంలో పాటలో దక్కించుకున్నవారు మరో పదిరూపాయలు అదనంగా పెంచి అమ్ముతున్నారు. వారిని ఇటు దేవదాయశాఖ అధికారులు, ఇతర అధికారులు ప్రశ్నించలేని పరిస్థితి ఉందని భక్తులు అంటున్నారు.
రెండితల ధరలు
ఏడాది వ్యవధిలోనే ధర రెండితలైంది. ప్రస్తుతం కార్తీకమాసంతో పాటు అయ్యప్పమాలాధారుల సీజన్, శుభ ముహుర్తాలు అధికంగా ఉన్నాయి. దీని కారణంగా టెంకాయలకు డిమాండ్ పెరిగింది. మదనపల్లె మార్కెట్‌కు గుడియాత్తం నుంచి టెంకాయలు దిగుమతి అవుతున్నాయి. వీటిని సైజును బట్టి అమ్ముతున్నారు. ప్రస్తుతం ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో తుపాన్ల కారణంగా కొబ్బరితోటలు దెబ్బతినటంతో ధర మరింత పెరిగే అవకాశం ఉందని విక్రయదారులు అంటున్నారరు. ఏడాది ముగిసే నాటికి రూ,60 వరకు పెరిగే అకాశముందని పేర్కొంటున్నారు. వేసవిలో మండుటెండల నుంచి రక్షణ కోసం సామాన్యులు సైతం కొబ్బరి నీళ్లను తాగుతుంటారు. వచ్చే వేసవికి కొబ్బరిబొండాం ధర రూ70 వరకు పెరిగే అవకాశం ఉందని విక్రయదారులు చెబుతున్నారు.


