రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లింలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు.


