కడపకు రాజంపేట సోమశిల !
● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
● ఎస్‌డీసీ తరలింపునకు రంగం సిద్ధం
● ముంపువాసుల్లో వ్యతిరేకత
సోమశిల బ్యాక్‌వాటర్
రాజంపేట : రెడ్డివారివీధిలో ఉన్న సోమశిల ఎస్‌డీసీ కార్యాలయం
రాజంపేట : నాలుగుదశాబ్దాలుగా పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో ముంపువాసులకు సేవలందించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం(ఎస్‌డీసీ) తరలింపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల పరిధిలోని ముంపు గ్రామాలకు సోమశిల వెనుకజలాల నిల్వ నేపథ్యంలో పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఇటువంటి పరిస్ధితులో సోమశిల ఎస్‌డీసీ కార్యాలయం కడపకు తరలించడం ముంపుబాధితుల్లో ఆందోళన నెలకొంది.ఎస్‌డీసీ కార్యాలయం తరలింపును ముంపుబాధితులు అడ్డుకుంటారనే ఉద్దేశంతో పోలీసుల బందోబస్తు మధ్య తరలించాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.
టీడీపీ పాలనలో..
టీడీపీ పాలనలో సోమశిల ముంపుబాధితులకు పరిహారం చెల్లింపులో జాప్యం, .మరోవైపు అందుకు సంబంధించిన ఎస్‌డీసీ కార్యాలయం తరలింపు అంశాలు ముంపుబాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నందలూరు, పెనగలూరు, అట్లూరు, ఒంటిమిట్ట, గోపవరం తదితర ప్రాంతాల్లో వివిధ కేటగిరీలకు సంబంధించి ముంపు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. నలభై సంవత్సరాలుగా రాజంపేటలోనే సోమశిల–యూనిట్–4 కార్యాలయం ఉండటం వల్ల ముంపువాసులకు అనువుగా ఉండేది. ఒక దశలో నెల్లూరుకు కూడా సోమశిల ఎస్‌డీసీ కార్యాలయాన్ని తరలించాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు.
వైఎస్సార్‌సీపీ పాలనలో తరలింపునకు బ్రేక్..
వైఎస్సార్‌సీపీ పాలనలో సోమశిల ఎస్‌డీసీ కార్యాలయాన్ని తరలించేందుకు కొందరు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. అప్పటి శాసనసభ్యుడు, మాజీ ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డి దీనిని తరలించడాన్ని అడ్డుకున్నారు. దీంతో రాజంపేటలో నుంచి సోమశిల ముంపుపరిహారానికి సంబంధించి కార్యకలాపాలను కొనసాగించారు.
ఇన్‌చార్జి ఎస్‌డీసీలతోనే కాలయాపన..
రాజంపేట సోమశిల ఎస్‌డీసీ కార్యాలయానికి ఇన్‌చార్జి ఎస్‌డీసీలతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తోంది. ఒకప్పుడు రాజంపేట రెవెన్యూ డివిజనల్ అధికారినే ఎస్‌డీసీగా నియమించేవారు. ఇప్పుడు రాజంపేటకు సబ్‌కలెక్టర్ ఐఏఎస్ హోదా కలిగిన వారు అధికారులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో రాజంపేట ఎస్‌డీసీ ఇన్‌చార్జిని రాయచోటి ఆర్డీవోకు అప్పగించారు. ఈ కుర్చీ ఎప్పుడూ బాధితులకు ఖాళీగానే దర్శనిమిస్తోంది
కుప్పలు..తెప్పలుగా పెండింగ్ కేసులు
సోమశిల ముంపుపరిహారం చెల్లింపులు తదితర అంశాలకు సంబంధించి కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఎస్‌డీసీలు అధికంగా కోర్టుల చుట్టూ ప్రదిక్షణలు చేయడం కొనసాగుతోంది. ఫలితంగా సోమశిల ఎస్‌డీసీ కార్యాలయానికి సంబంధించి విధుల నిర్వహణలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. సోమశిల వెనుకజలాలకు భూసేకరణ, అలాగే వివిధ స్ధాయిలో భూములకు, ఇళ్లకు ఇవ్వాల్సిన పరిహారం లాంటి అనేక అంశాలపై ఎస్‌డీసీ దృష్టి సారించి, కార్యరూపం దాల్చేలా చేయాల్సి ఉంటుంది. కేవలం కోర్టు కేసులతో వీరు విసిగిపోయారు. దీంతో సోమశిల ఎస్‌డీసీ పోస్టులో పనిచేయడానికి అర్హత కలిగిన ఉన్నఽతాధికారులు ఎవరు ముందుకురావడంలేదన్నది నిత్యసత్యం. పైగా ప్రభుత్వం సోమశిల ముంపుబాధితులకు సంబంధించి పరిహారం కోసం బడ్జెట్ కేటాయింపు ఎండమావిగానే కనిపిస్తున్నాయని ముంపుబాధితులు గగ్గోలు పెడుతున్నారు.
కడపకు రాజంపేట సోమశిల !


