కిడ్నీ రాకెట్ ముఠాలో కూటమి నాయకులు
● కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
● సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలి
మదనపల్లె రూరల్ : మదనపల్లెలో కూటమి ప్రభుత్వ మద్దతుదారుల ఆస్పత్రిలో కిడ్నీ దొంగతనం జరిగిందని, ఈ రాకెట్‌లో కూటమి నాయకులు ఉన్నట్లు తమకు తెలిసిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఆదివారం మాలమహానాడు రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు మదనపల్లెకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించలేదని, తక్షణమే స్పందించి కిడ్నీ దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిడ్నీల దొంగతనం దుర్మార్గం, అన్యాయమని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని, వారికి స్కాలర్‌షిప్‌లు రావడం లేదన్నారు. ఎస్సీ, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మూసివేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులందరికీ పుల్ మెస్ చార్జీలు ఇచ్చామని, ఇప్పుడు ఆపేశారని, ప్రభుత్వం స్పందించి పూర్తిగా చెల్లించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్సిడీలు ఇవ్వాలి కానీ, సుందర్ పిచ్చయ్య పేదోడు కాదని, కోటీశ్వరుడని, ఆయనకు 22 వేల కోట్ల సబ్సిడీలు ఇచ్చారన్నారు. రాష్ట్రానికి 18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకొంటూ ముఖ్యమంత్రి కాలక్షేపం చేస్తున్నారని, ఎస్సీ కాలనీలోని బడులను మూసివేస్తున్నారన్నారు. ఎస్సీల పరిస్థితి దారుణంగా ఉందని, మూడు పూటల్లో ఒకపూట కూడా భోజనం చేయలేకపోతున్నారని, చంద్రబాబు కళ్లు తెరవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీసిటీలో 300 పరిశ్రమలు తెచ్చి లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామని, ప్రస్తుతం 60 వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నా, ఏరోజు చంద్రబాబునాయుడు ప్రభుత్వం మాదిరిగా డబ్బా కొట్టుకోలేదన్నారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు మదనపల్లెకు ఏమీ చేయలేదన్నారు. మదనపల్లెకు మంజూరైన మెడికల్ కాలేజీని మూసేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ దారుణమని, దళితులందరూ ఐక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ నాయకులు యమలా సుదర్శనం, దాసరి చెన్నకేశవులు, అశోక్‌బాబు, స్వర్ణా వెంకయ్య, పూతలపట్టు ప్రభాకర్, ఎం.ఎన్.మూర్తి, చెరుకూరి గంగులయ్య, గుమ్మగట్టు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.


