మదనపల్లె : పెద్దమండ్యం మండలంలో బైక్ ను వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్ర గాయాలకు గురైన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు కలిచెర్లకు చెందిన రియాజ్ అహ్మద్ (62), అతని భార్య గరీబున్నీషా(53) సొంత పని నిమిత్తం బైక్ మీద మదనపల్లెకు బయలుదేరారు. మార్గ మధ్యలో సిద్దవరం వద్దకు రాగానే వాహనం బైక్ ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన దంపతులను 108లో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో కోలుకుంటున్నారు.
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
రాజంపేట : రాజంపేట పట్టణంలోని ఉస్మాన్ నగర్‌లో శనివారం సాయంత్రం షేక్ షావల్లి (28) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకు న్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. షేక్ షావల్లి వృత్తిరీత్యా కారు డ్రైవర్. భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం
రైల్వేకోడూరు అర్బన్ : స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట మండలంలోని శెట్టిగుంటకు చెందిన యాస్మిన్ అనే మహిళ ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. తన భర్త అప్సర్ తనకు తెలియకుండా రాజంపేటకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడని, తన సమస్యను పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. బాధితురాలితో మాట్లాడి జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు


