కిడ్నీ దొంగలను కాపాడేలా ప్రభుత్వ వైఖరి
● జిల్లా జడ్జితో సమగ్ర విచారణ జరపాలి
● సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు
మదనపల్లె రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి డయాలసిస్ కేం ద్రం, గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా నడిచిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ముఠా పెద్దలను కాపాడేలా ప్రభుత్వ వైఖరి ఉందని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం సీపీఎం నాయకుడు హరిశర్మతో కలసి గ్లోబల్ ఆస్పత్రి ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడారు. కిడ్నీ దొంగల చేతిలో కిడ్నీలు పోగొట్టుకున్నది ఎవరు? ఎక్కడి వారు? ఆ కిడ్నీలతో లబ్ధి పొందింది ఎవరు? ఎక్కడెక్కడి కిడ్నీ ముఠా సంబంధాలు ఉన్నాయి? అనే విషయాలు తేల్చాలని, అందుకోసం జిల్లా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆరుగురు కిడ్నీ దొంగలను అరెస్టు చూపిన పోలీసులు, గ్లోబల్ ఆసుపత్రిని ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. కిడ్నీ ముఠా వల్ల లబ్ధి పొందిన వారి వివరాలు, విచారణ నివేదికను వెల్లడించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. యమున అనే యువతి చనిపోతే మృతదేహాన్ని రెండు రోజుల పాటు దాచేసి, గుట్టుచప్పుడు కాకుండా ఆమె స్వగ్రామానికి తరలించే ప్రయత్నంలో.. కిడ్నీ రాకెట్ ముఠా సభ్యుల మధ్య పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగా కిడ్నీ రాకెట్ వ్యవహారం బట్టబయలైందని గుర్తుచేశారు. కిడ్నీ రాకెట్‌లో కీలక పాత్ర ఉన్న గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యంలోని డాక్టర్ ఆంజనేయులు మినహా అందులో పని చెస్తున్న వైద్య బృందం డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతిలపై ఎలాంటి కేసులు నమోదు చేయక పోవడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కిడ్నీ రాకెట్‌లోని మూలాలను గుర్తించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, బెంగళూరు వైద్యుడు ఎవరు అనే విషయం తేల్చలేదని, కిడ్నీ రాకెట్‌లో అసలైన దొంగల ముఠాను పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. పెద్దస్థాయిలో పైరవీలు జరుగుతున్న కారణంగా కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లను కేసులో చేర్చలేదని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


