
మద్యం సిండికేట్!
సాక్షి రాయచోటి: కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బరితెగింపులు, దౌర్జన్యాలు, దాడులు, ఆగడాలు పెరిగిపోయాయి. ఎక్కడ ఏం చేయాలన్నా భయపడే పరిస్థితి నెలకొంటుండగా, మరొకవైపు టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఆర్థిక వనరులపై దృష్టి పెట్టారు. ఎక్కడ అవకాశం ఉన్నా నయానో, భయానో చేజిక్కించుకునేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే బ్రాందీ షాపులకు సంబంధించి ఎవరూ టెండర్లు వేయకుండా అడ్డుపడిన కూటమి నేతలు మరొకమారు బార్ల విషయంలోనూ అదే పంథా కొనసాగిస్తున్నారు. మద్యానికి సంబంధించి సిండికేట్‌గా మారి బార్లను చేజిక్కించుకోవడంతోపాటు ఎవరూ టెండర్ల వైపు వెళ్లకుండా చూసుకోవడం కొసమెరుపు.
● జిల్లాలో 11 ఓపెన్ బార్లు, ఒక రిజర్వుడ్ బార్‌కు సంబంధించి టెండర్లను ఆహ్వానించారు. అయితే వారం రోజులు అవకాశం ఇచ్చినా దరఖాస్తుకు ఎవరూ ముందుకు రాలేదు. రాయచోటిలో 1 బార్‌కు నలుగురు, మరొక బార్‌కు సంబంధించి నలుగురు దరఖాస్తు చేసుకోగా, రిజర్వుడు కేటగిరీ కింద వచ్చిన బార్‌కు సంబంధించి ఐదు దరఖాస్తులు, రాజంపేటలోనూ ఒక బార్‌కు నలుగురు, మదనపల్లెలో ఒక్కో బార్‌కు సంబంధించి ఐదుగురు దరఖాస్తుచేశారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక బార్‌కు నలుగురు దరఖాస్తు చేస్తేనే లాటరీ ద్వారా డిప్ తీసి ఖరారు చేస్తారు. ప్రతి దానికి కరెక్టుగా నలుగురే వేయడం చూస్తే సిండికేట్ కాకుండా మరేమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది. భారీగా రావాల్సిన దరఖాస్తులు కేవలం లక్కీ డిప్ తీసేందుకు అవసరమైన మేరకే రావడం సిండికేట్ వ్యవహారాన్ని బలపరుస్తోంది. ఇప్పటికే కూటమి సర్కార్ విచ్చలవిడిగా మద్యం షాపులతోపాటు బెల్ట్ షాపులను తెరిచి ప్రజలకు నిత్యం మద్యం లభించేలా చర్యలు చేపట్టారు.
ఇది కాదా సిండికేట్?
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది, అది అంటూ ఏమి లేదు. ఏదైనా సాధ్యమేనని ఇట్టే తెలిసిపోతోంది. అందులో భాగంగా 11 ఓపెన్ బార్లతోపాటు మరో రిజర్వుడు కేటగికి కింద బార్‌కు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తే ఒక్కో బార్‌కు నలుగురు, మరో బార్‌కు ఐదుగురు మాత్రమే దరఖాస్తుచేశారు. కూటమి నేతలు భయపెట్టారో...లేక వేయవద్దని చెప్పారో తెలియదుగానీ దరఖాస్తుకు చాలామంది వెనుకంజ వేశారు. ఉన్న వాళ్లలో వాళ్లే మాట్లాడుకుని నలుగురు కలిపి బార్లకు దరఖాస్తు చేయడం ఎవరికి వచ్చినా అందరూ కలిసిమెలిసి చేసుకునేలా పథక రచన చేసినట్లు తెలుస్తోంది. కూటమి సర్కార్ హయాంలో మద్యం సిండికేట్‌గా మారి బార్లను దక్కించుకుంటున్నారు.
లక్కీడిప్‌కు అర్హత సాధించని నాలుగు బార్లు
కూటమి సర్కార్‌లోని పెద్దలు భయపెట్టారో, లేక దరఖాస్తు చేయవద్దని చెప్పారోగానీ పలు బార్లకు లక్కీడిప్‌కు అవసరమైన దరఖాస్తులు రాలేదు. మదనపల్లెలో రెండు బార్లకు సంబంధించి ఒక్కో దరఖాస్తు రాగా, పీలేరులో ఒక బార్‌కు సంబంధించి రెండు దరఖాస్తులు, రాయచోటిలో ఒక బార్‌కు సంబంధించి ఒక దరఖాస్తు మాత్రమే రావడంతో వాటిని పరిగణలోకి తీసుకోలేదు. సాధారణంగా నాలుగు దరఖాస్తులు వస్తేనే లక్కీ డిప్ వేయడానికి అర్హత సాధించినట్లు ప్రభుత్వ లెక్క. అయితే దరఖాస్తులు రాకపోవడంతో వాటిని డిప్ తీయలేదు. అయితే మరొకసారి వాటికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానించే అవకాశం ఉంది.
ఒక్కోబార్‌కు పరిమితికి నాలుగు దరఖాస్తులు రావాలంటే అన్నీ వచ్చినట్లు లెక్క
అనుకున్న వారే వేశారు.. వారే దక్కించుకున్నారు
టీడీపీ ఆగడాలు, బెదిరింపులులతోచాలామంది వెనుకడుగు
పలు షాపులకు లక్కీ డ్రా తీసిన జిల్లా కలెక్టర్
జిల్లా వ్యాప్తంగా 11 ఓపెన్ బార్లకు, ఒక రిజర్వ్‌డ్ బార్‌కు లాటరీ ద్వారా కేటాయింపు జరిపామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. మదనపల్లె డివిజన్‌లో మూడు , రాయచోటిలో రెండు , రాజంపేటలో రెండు, కల్లుగీత కార్మికులకు ఒక రిజర్వ్‌డ్ బార్ సహా మొత్తం 11 ఓపెన్ బార్లకు, ఒక రిజర్వ్‌డ్ బార్‌కు లాటరీ ద్వారా కేటాయించామని వివరించారు. మదనపల్లెలో ఎ.రాజన్న, బి. మనోహర్, బి.నాగరాజులు, రాయచోటిలో దొండ్ల హర్షవర్ధన్, పేరం ఇరగంరెడ్డి, రాజంపేటలో కె.సురేష్ కుమార్ నాయుడు, కె. సుబ్బయ్యలు, అలాగే కల్లుగీత కార్మికులకు రిజర్వ్‌డ్ బార్ కేటాయింపులో బి.కొత్తకోట బార్‌ను కె.ఆదిత్యకు లాటరీ డ్రా ద్వారా కేటాయి ంచామని కలెక్టర్ తెలిపారు. మిగిలిన నాలుగు బార్లకు తగినన్ని దరఖాస్తులు రాకపోవడంతో లాటరీ నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు.

మద్యం సిండికేట్!