
వ్యాపారుల సిండికేటు.. రైతులకు చేటు
● వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు
తగ్గించడంతో బొప్పాయి రైతుల ఆందోళన
● ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన
● అధికారులు స్పందించాలని వేడుకోలు
ఓబులవారిపల్లె : ఉత్తర భారతదేశానికి చెందిన సేట్లు సిండికేట్ కావడంతో ఉద్యాన పంటలకు పేరు గాంచిన రైల్వేకోడూరు ప్రాంతం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారు నిర్ణయించిన ధరకే రైతులు తమ పంటను అమ్ముకోవాలి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో బొప్పాయి రైతుకు కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. మద్దతు ధర లేకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు..
బొప్పాయి రైతులు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని, న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను రైతులు కోరగా ఆగస్టు ఒకటో తేదీ జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి సేట్‌తో అనంతరాజుపేట వైఎస్సార్ ఉద్యాన కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఐదో తేదీ వరకు రూ. 9లు, ఆరో తేదీ నుంచి పది రూపాయలు కనీస ధర అమలు చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు కొన్ని రోజుల పాటు తొమ్మిది రూపాయలతో అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత ఒక్కసారిగా ధర రూ. 5కు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. అధికారులు కూడా కలెక్టర్ ఆదేశాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
సిండికేట్‌తో దగా పడుతున్న రైతు..
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు తదితర కారణాలు నెపంగా చూపి సేట్ వ్యాపారులు సిండికేట్ కావడంతో బొప్పాయి ధర కిలో ఐదు రూపాయలుగా నిర్ణయించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఆత్మహత్యలే శరణ్యం..
రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో దాదాపు 7300 ఎకరాల్లో బొప్పాయి సాగులో ఉంది. ఎకరాకు సాగు చేయడానికి రూ. 70 వేలు నుంచి రూ. 80 వేలు ఖర్చు వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బాధలు అన్నింటినీ తప్పించుకున్న రైతు పంట కోత కోసే సమయానికి సేట్ వ్యాపారులు సిండికేట్‌గా మారి వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఎంత కష్టపడినా, అప్పులు చేసి పంటలు పండించినా రైతులకు నష్టాలు వస్తుండటంతో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఉత్తర భారత సేట్ వ్యాపారులను, దళారులను నియంత్రించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ధరలు కల్పించకపోతే చనిపోతామని చిట్వేలి బొప్పాయి రైతులు బహిరంగంగా అధికారులకు వీడియో ద్వారా సామాజిక మాధ్యమాలలో తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి బొప్పాయి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ధర లేదు..
ఇటీవల కాలంలో బొప్పాయి ఇంత తక్కువగా ఎప్పుడూ అమ్ముడు పోలేదు. ఐదు రూపాయలు ధర నిర్ణయించడం ఏమిటి. దళారులు మా లాంటి రైతులను దోచుకోవడానికి చేస్తున్న కుట్ర. పట్టించుకునే వారు ఎవరూ లేరా. కలెక్టర్ ఆదేశాలు అమలు చేయరా.. ఇక మా పరిస్థితి ఏమిటి. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
టంగుటూరి కృష్ణారెడ్డి, బొప్పాయి రైతు, గాడివారిపల్లి, ఓబులవారిపల్లి
కలెక్టర్ ఆదేశాల అమలులో విఫలం..
బొప్పాయి ధర కనీసం రూ. 10లుగా జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదేశించగా దళారులు, వ్యాపారులు సిండికేట్‌గా మారి ఐదు రూపాయలు నిర్ణయించడం ఏమిటి. జిల్లా కలెక్టర్ స్పందించి వ్యాపారులపై కేసులు నమోదు చేయాలి. దళారీ వ్యవస్థను రద్దు చేసి లైసెన్సు వ్యాపారాన్ని ప్రారంభించాలి.
సీహెచ్ చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు

వ్యాపారుల సిండికేటు.. రైతులకు చేటు

వ్యాపారుల సిండికేటు.. రైతులకు చేటు

వ్యాపారుల సిండికేటు.. రైతులకు చేటు