
9న బౌద్ధుల చలో మదనపల్లె
మదనపల్లె రూరల్ : బుద్ధుని కొండలో బుద్ధుడి విగ్రహానికి అధికారులు కంచె ఏర్పాటు చేసి, కొండపైకి వెళ్లే దారిని మూసివేయడంపై ఆల్ ఇండియా భిక్కు సంఘం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్త భంతే సద్దారక్కిత ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని బౌద్ధుల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా పరిగణిస్తామని, ఆగస్టు 9న బౌద్ధ భిక్షువులు, బౌద్ధాభిమానులు పెద్ద సంఖ్యలో మదనపల్లెకు తరలివచ్చి బుద్ధుని కొండలో జరుగుతున్న దుర్ఘటనలపై తేల్చుకుంటామని హెచ్చరించారు. ఆల్ ఇండియా భిక్కు సంఘం, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, బుద్ధిస్ట్ ఫ్రెటర్నటీ కౌన్సిల్, మహాబోధి సొసైటీ, బుద్ధ అంబేద్కర్ సమాజ్, అంబేడ్కర్ బుద్ధిస్ట్ సొసైటీ తదితర బౌద్ధ సంఘాలతో పాటు అంబేడ్కరిస్టులు, దళిత, వామపక్ష, ప్రగతిశీల సంఘాలను ఏకంచేసి, ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించేలా మదనపల్లెలో ధమ్మ నిరసన చేపడతామన్నారు. ఆగస్టు 9లోపు బుద్ధుడి విగ్రహం ధ్వంసంతో పాటు తల వేరుచేసిన ఉన్మాదులను అరెస్ట్ చేయాలన్నారు. బుద్ధునికొండకు వేసిన కంచెను తొలగించడంతో పాటు బౌద్ధులపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుపై ఎస్సీ,ఎస్టీ(పీఓఏ) యాక్ట్‌లోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయాలన్నారు. అనంతరం ఆగస్టు 9న చలో మదనపల్లె వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముందు బౌద్ధ ఉపాసకులు పీటీయం.శివప్రసాద్ ఇంటికి వెళ్లి, గుండెకు స్టంట్ వేసుకుని విశ్రాంతిలో ఉన్న ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో బాస్ ప్రతినిధులు ముత్యాల మోహన్, సొన్నికంటి రెడ్డెప్ప, జనార్దన్, గంగాధర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.