
బాలల చట్టాలపై అవగాహన అవసరం
ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి
మదనపల్లె రూరల్ : బాలల హక్కుల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాలు జరిపితే కఠినమైన శిక్షలు విధిస్తామని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారత అధికారి జి.ఉమాదేవి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా బుధవారం... జేజే యాక్ట్ 2015, పీసీఎంఏ యాక్ట్ 2006, పోక్సో యాక్ట్ 2012, ది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్, రెగులేషన్ యాక్ట్ 1986, పీసీపీఎన్‌డీటీ యాక్ట్ 1994, ది సీపీసీఆర్ యాక్ట్ 2005 పై డివిజన్ స్థాయిలో సీడబ్ల్యూపీఓ, పంచాయతీ సెక్రటరీలు, ఎంఈఓ, ఎంఎస్‌కే, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఐసీడీఎస్ అధికారి ఉమాదేవి మాట్లాడుతూ బాలికల అక్షరాస్యతా శాతాన్ని మరింతగా పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాలికా నిష్పత్తిని పెంచాలన్నారు. సమాజంలో అనాథ బాలలు, పాక్షిక అనాథలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాలలు, భిక్షాటనకు గురి అవుతున్న బాలలు, బాల్యవివాహాలకు గురిఅవుతున్న బాలలు, రక్షణ, సంరక్షణ అవసరమైన బాలలను సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ బాలలకు గ్రామ స్థాయి నుంచి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రామస్థాయి కమిటీలను నియమించామన్నారు. కార్యక్రమంలో పోర్ట్ లలితమ్మ, సీడీపీఓ సుజాత, భారతి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.