
రైతుల సంక్షేమం కోసం పీఎం ప్రణామ్ పథకం
జిల్లా కలెక్టర్ శ్రీధర్
రాయచోటి: రైతుల సంక్షేమంకోసం కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజిఆర్‌ఎస్ హాలులో పచ్చిరొట్ట జీవన ఎరువుల గోడపత్రికను జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా వ్యవసాయ అధికారి జి శివనారాయణలు ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పీఎం ప్రణామ్ స్కీమ్ ద్వారా ఎరువుల సమతుల్యత వినియోగాన్ని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అన్నారు. ఈ పథకం ద్వారా కృత్రిమ, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ, జీవన ఎరువుల వాడకాన్ని పెంచడమే ఉద్దేశమని, తద్వారా ఆరోగ్యమైన నేలతోపాటు సారం, పోషకాల లభ్యత పెరిగి నాణ్యమైన పంట దిగుబడి వస్తుందని కలెక్టర్ తెలిపారు.
● వర్షానికి ముందే పచ్చిరొట్ట.. పొడి విత్తనాలు చల్లుకోవడం వల్ల వర్షం పడిన తర్వాత పంట మొలకెత్తడంతోపాటు నేలసారం పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు. నత్రజని సంబంధిత జీవన ఎరువు, రైజోబియం, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, భాస్వరం, సంబంధిత జీవన ఎరువు పాస్పరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టిరియా, పొటాషియం, రిలీజింగ్ బ్యాక్టిరియా వాడటం వల్ల మొక్కకు పోషకాల లభ్యత పెరుగుతుందని కలెక్టర్ సూచించారు.