
ఫోన్లో మాట్లాడొద్దంటే విద్యార్థి అదృశ్యం
బి.కొత్తకోట : డిగ్రీ చదువుతున్న కుమార్తె ఫోన్‌లో మాట్లాడటం చూసిన తండ్రి మందలించాడని అదృశ్యమైన ఉదంతం బి.కొత్తకోటలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు. స్థానిక బీసీ కాలనీకి చెందిన వెంకటాద్రి కుమార్తె మేఘన (19) డిగ్రీ రెండో ఏడాది చదువుతోంది. శనివారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వచ్చిన మేఘన ఫోన్లో మాట్లాడుతుండగా వెంకటాద్రి మందలించాడు. దీనికి మనస్థాపం చెందిన మేఘన ఇంటినుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు పలుచోట్ల ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆటో బోల్తా పడి
ఇద్దరికి గాయాలు
మదనపల్లె రూరల్ : ఆటో బోల్తా పడి ఇద్దరు గాయపడిన సంఘటన ఆదివారం చౌడేపల్లి మండలంలో జరిగింది. సోమల మండలం నెల్లిమందకు చెందిన గంగులప్ప కుమారుడు మునిరాజ (27), తన మరదలు రెడ్డి ఈశ్వరి (18)తో కలసి ఆటోలో పొట్టేలు వేసుకుని బోయకొండలో మొక్కు చెల్లించుకునేందుకు బయలుదేరారు. ఆటో బోయకొండ సమీపంలోకి రాగానే లోపల ఉన్న పొట్టేలు హఠాత్తుగా బయటకు దూకింది. దానిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన మునిరాజ, ఆటో డ్రైవింగ్‌పై అదుపు తప్పడంతో వాహనం బోల్తా పడి, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
చెరువులో జారి పడి
గొర్రెల కాపరి మృతి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు వ్యాసరాయ చెరువులో ఓ గొర్రెల కాపరి ఆదివారం ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. కమ్మచెరువు పంచాయతీ మొరుసుపల్లికి చెందిన చిన్నకోట్ల మారప్ప (62) తన గొర్రెలను శుభ్రం చేసేందుకు చెరువులోకి వెళ్లగా ప్రమాదవశాత్తు జారి చెరువులో గల్లంతయ్యాడు. తోటి కాపరులు విషయాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పీటీఎం ఎస్‌ఐ హరిహర ప్రసాద్, ములకలచెరువు ఫైర్ సిబ్బంది హుటాహుటిన చెరువు వద్దకు చేరుకుని శవం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో గుర్తు తెలియని వ్యక్తులు చేపల కోసం వదలిన వలలో ముళ్ల చెట్టు వద్ద శవం చిక్కుకున్నట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. చెరువులోని ముళ్లచెట్టుకు తాడు వేసి శవాన్ని వెలికి తీశారు.

ఫోన్లో మాట్లాడొద్దంటే విద్యార్థి అదృశ్యం

ఫోన్లో మాట్లాడొద్దంటే విద్యార్థి అదృశ్యం