
జిల్లా ఎస్పీతో ప్రాణాలకు ముప్పు
మదనపల్లె రూరల్ : బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసి, తలను వేరుచేసిన ఉన్మాదుల్ని పట్టుకోవడంలో ఘోరంగా విఫలమైన జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, కేసును తప్పుదోవ పట్టించేందుకు తమపై తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని భారతీయ అంబేద్కర్ సేన(బాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీయం.శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గుండె జబ్బుతో బాధపడుతూ, చికిత్స పొందుతున్న తనపై తప్పుడు కేసులు బనాయించి, తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని, ఎస్పీ వేధింపులతో తన ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉందని, అదే జరిగితే దానికి ఆయనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బుద్ధ విగ్రహం ధ్వంసం జరిగి 20 రోజులవుతున్నా, ఇప్పటికీ ఉన్మాదులను పట్టుకోకపోగా, నిరసన తెలుపుతున్న దళిత నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. శనివారం రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చి, తలుపునకు మూడు నోటీసులు అతికించి వెళ్లారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని బుద్ధ విగ్రహం ధ్వంసం చేసిన ఉన్మాదులను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. దళితుడైన తనను తీవ్ర వేధింపులకు, అవమానాలకు గురిచేస్తూ, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లేలా చేసిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుపై కేసు నమోదుకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
బాస్ వ్యవస్థాపకుడు పీటీయం.శివప్రసాద్