
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
తొండూరు : అధికార టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో తొండూరు మండలం ఇనగలూరు గ్రామంలో అధికార పార్టీకి చెందిన దస్తగిరిరెడ్డి (బాబురెడ్డి), అదే పార్టీకి చెందిన బాల ఓబుళరెడ్డిల మధ్య ఉపాధి హామీలో చీనీ బిల్లుల విషయమై ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో దస్తగిరిరెడ్డి తమకు బిల్లులు రాకుండా అడ్డుకున్నారని బాల ఓబుళరెడ్డి వర్గీయులు ఈ ఏడాది జనవరి మాసంలో దస్తగిరిరెడ్డిపై దాడి చేశారు. దీంతో అప్పటి నుంచి బాల ఓబుళరెడ్డి వర్గీయులు జైలు నుంచి వచ్చిన తర్వాత ఇనగలూరు గ్రామానికి వెళ్లకుండా బయట తిరిగేవారు. నెల రోజుల క్రితం పోలీసులు ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి ఘర్షణలకు దిగకుండా అందరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు. దీంతో బాల ఓబుళరెడ్డి వర్గీయులు ఇనగలూరు గ్రామంలోకి వెళ్లి పనులు చేసుకుంటుండేవారు. శనివారం బాల ఓబుళరెడ్డి కుమారులు సమరసింహారెడ్డి, హరికిశోర్‌రెడ్డిలు ద్విచక్రవాహనంపై ఇనగలూరు నుండి పులివెందులకు వస్తుండగా సైదాపురం బస్టాప్ దాటగానే వెనుకవైపు నుంచి దస్తగిరిరెడ్డితోపాటు మరికొంతమంది కారులో వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి సమర సింహారెడ్డి, హరికిశోర్‌రెడ్డిలపై రాడ్లతో దాడి చేశారు. దీంతో వారి తలకు బలమైన రక్తపు గాయాలతోపాటు కాలు విరిగినట్లు తెలిసింది. దాడి జరిగే సమయంలో కొంతమంది స్థానికులు వచ్చి గాయపడిన వారిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమరసింహారెడ్డి, హరికిశోర్‌రెడ్డిలను పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సీఐ వెంకటరమణలు దాడి జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. అక్కడి వైద్యులు చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో కడపకు రెఫర్ చేశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ ఘన మద్దిలేటిలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనంపై వెళుతుండగా కారుతో ఢీకొట్టి రాడ్లతో దాడి చేసిన వైనం
ఇద్దరికి తీవ్ర గాయాలు..
పరిస్థితి విషమం
కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి
తరలింపు