
వాహన డ్రైవర్ల మధ్య ఘర్షణ
మదనపల్లె రూరల్ : తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల మధ్య జరిగిన ఘర్షణలో వాహనం అద్దాలు ధ్వంసమైన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. ములకలచెరువు మండలం బురకాయలకోటకు చెందిన శ్రీనివాసులు(37) తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పురిటిబిడ్డ, తల్లిని తరిగొండలో దింపేసి వాహనాన్ని జిల్లా ఆస్పత్రిలో నిలిపేందుకు రాగా, క్యాంటీన్ సమీపంలో మరో డ్రైవర్ పృథ్వీరాజ్ ఉన్నాడు. శ్రీనివాసులు వాహనం తన పక్కగా వెళ్లనివ్వడంతో మద్యం మత్తులో ఉన్న పృథ్వీరాజ్, శ్రీనివాసులును దూషించాడు. వాహనంలోకి ప్రవేశించి వాహనం పార్కింగ్ చేసే ప్రదేశం వరకూ వెళ్లాడు. అక్కడ శ్రీనివాసులును వాహనంలో నుంచి కిందకు దించి రాయితో విచక్షణా రహితంగా కొట్టాడు. ఆస్పత్రికి వెళ్లిన శ్రీనివాసులు చికిత్స పొందుతుండగా, పృథ్వీరాజ్ మరోసారి కత్తెర తీసుకుని పొడిచేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమై అతడిని బలవంతంగా ఆస్పత్రి బయటకు పంపించారు. అక్కడి నుంచి వెళ్లిన పృథ్వీరాజ్, శ్రీనివాసులుపై ద్వేషంతో అతడు నడుపుతున్న వాహనం అద్దాలను పగలగొట్టాడు. ఈ ఘర్షణలో పృథ్వీరాజ్ సైతం గాయపడ్డాడు. ఘటనపై బాధితుడు శ్రీనివాసులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారించారు.