
వ్యక్తి అదృశ్యం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కాయలవాండ్లపల్లికి చెందిన పెద్దపాళ్యం రామచంద్ర కుమారుడు పి.రాజశేఖర్(44) అదృశ్యమైనట్లు తల్లి క్రిష్ణమ్మ తెలిపారు. ఈ నెల 9వ తేదీన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమని ఇంటి నుంచి బయలు దేరాడని, ఇంతవరకూ ఇంటికి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గాలించినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొంది.
గిరిజన కుటుంబాలను ఆదుకుంటాం
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని శెట్టిగుంట ఎస్టీకాలనీలో ప్రమాదంలో మృతి చెందిన అన్ని కుటుంబాలను ఆదుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి తేజశ్వని పేర్కొన్నారు. గ్రామంలో బుధవారం ఆమె పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మృతిచెందిన ప్రతి కుటుంబాన్ని సందర్శించి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధ్యక్షులు శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనదారులపై కేసు నమోదు
సిద్దవటం : మద్యం తాగి నడుపుతున్న ద్విచక్ర వాహనదారులపై బుధవారం కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ తెలిపారు. సిద్దవటం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మాట్లాడుతూ కడప–చైన్నె ప్రధాన రహదారిలోని భాకరాపేట చెక్ పోస్టు వద్ద సోమవారం రాత్రి తనిఖీ చేస్తుండగా మద్యం తాగి ద్విచక్ర వాహనంలో వస్తున్న శివ, తుమ్మల ప్రవీణ్‌కుమార్‌ల పట్టుబడడంతో కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
పోక్సో కేసు నమోదు
పెద్దమండ్యం : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకునిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని వెలిగల్లు పంచాయతీ గురికివాండ్లపల్లెకు చెందిన యువతి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె కుమార్తె (15) పాపదాతగారిపల్లెలోని ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ నెల 6న ఇంటి వద్ద బాలిక ఉండగా గాలివీడుకు చెందిన మల్లెల రామక్రిష్ణ (19) మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘటనపై మంగళవారం రాత్రి బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం ములకలచెరువు మండలంలో జరిగింది. ములకలచెరువు రాజా నగర్‌కు చెందిన గంగన్న కుమారుడు నరసింహులు(60) గత కొంతకాలంగా షుగర్, బీపీతోపాటు, కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. వ్యాధి నివారణకు చికిత్స తీసుకున్నా ఫలితం కనిపించకపోవడంతో మనస్తాపం చెందాడు. బుధవారం ఇంటి వద్దే సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.