చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

Jul 15 2025 6:31 AM | Updated on Jul 15 2025 6:31 AM

చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

రాయచోటి : ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని చేనేతలను అన్ని విధాలుగా ఆదుకోవాలని చేనేత సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, చేనేత జౌళిశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డిలను వారు కలిసి వినతిపత్రం అందజేశారు. కూటమి అధికారంలోకి రావడానికి చేనేతలపై వరాల జల్లు కురిపించి ఓట్లు దండుకొని 14 నెలలు గడిచినా ఇంత వరకు చింతాకంత సాయం కూడా చేయలేదన్నారు. చేనేతలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చలేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో చేనేతలకు ఏడాదికి 24 వేల రూపాయలు ఇచ్చే వారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేతలకు ఏడాదికి రూ. 30 వేలు ఇవ్వాలని, జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించాలన్నారు. 45 ఏళ్లకే పింఛన్‌, ఆరోగ్యశ్రీ బీమా కల్పించాలని పేర్కొన్నారు. ముద్ర రుణాలు బ్యాంకుకు లింక్‌ చేయకుండా.. డైరెక్ట్‌గా అందించాలన్నారు. అలాగే మరో 5 లక్షల వరకు జీరో వడ్డీతో రుణాలు అందించాలని కోరారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు అందరూ చేనేత వస్త్రాలను ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రభుత్వ స్కూల్‌లో ఇస్తున్న స్కూల్‌ యూనిఫామ్‌ చేనేత వస్త్రాలతో తయారు చేసినవి ఇవ్వాలని విన్నవించారు. గృహాలు మంజూరు చేసి రాష్ట్ర ఆప్కో చైర్మన్‌ డైరెక్టర్లను త్వరగా భర్తీ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేనేత జిల్లా అధ్యక్షులు శీలం రమేష్‌, చేనేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడం నాగభూషణం, వైఎస్సార్‌సీసీపీ రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి సిబ్యాల విజయ భాస్కర్‌, తంబళ్లపల్లి నియోజకవర్గ చేనేత అధ్యక్షులు జి.వెంకటేశ్వర్‌రెడ్డి, చేనేత నాయకులు అనంత మునిశేఖర్‌, వీరబల్లి మండల చేనేత అధ్యక్షులు మోడం మదనమోహన్‌, గుండ్లపల్లి శ్రీనివాసులు, సిబ్యాల బాలాజీ, పురం శివయ్య, పలువురు చేనేత నాయకులు పాల్గొన్నారు.

ఏడాదైనా అమలు చేయని కూటమి ప్రభుత్వం

జేసీపీ బీసీ నేతలు డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement