
రమణీయం..రథోత్సవం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్‌కుమార్, మనోజ్‌కుమార్, సునీల్‌కుమార్, సాయిస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామిని రథంపై కొలువుదీర్చి ముందుకు కదిలించారు.భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. గోవింద నామస్మరణలతో మాడవీధులు మార్మోగాయి. శనివారం రాత్రి అశ్వవాహనంపై సౌమ్యనాథ స్వామి పురవీధుల్లో విహరించారు. భక్తులు కాయ, కర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు రీజెన్సీ నలంద విద్యాసంస్థల అధినేత జీఎన్ నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సౌమ్యనాథ సేవ ట్రస్టు అధ్యక్షుడు ఎద్దుల సుబ్బరాయుడు, కోశాధికారి చక్రాల రామసుబ్బన్న, ఎద్దుల విజయసాగర్, ఆలయ సూపరిండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం, రీజెన్సీ నలంద స్కూల్ వైస్ ప్రిన్సిపల్ దశరథరామయ్య, ప్రిన్సిపల్ సుబ్బరాయుడు పాల్గొన్నారు.
నేడు చక్రస్నానం : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు.
వైభవంగా సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు