
అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
రాయచోటి టౌన్ : అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచుకున్న 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొని తమిళనాడుకు చెందిన ఆండీ గోవిందన్ అనే అంతర్ రాష్ట్ర స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ ( పరిపాలన) యం. వెంకట్రాద్రి తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించే క్రమంలో శనివారం సుండుపల్లె మండలం రాయవరం గ్రామం కావలిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో రూరల్ సీఐ వరప్రసాద్, సుండుపల్లె ఎస్‌ఐ యం. శ్రీనివాసులుతో పాటు టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడులలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 26 దుంగలు స్వాధీనం చేసుకున్నారన్నారు. వీటి విలువ సుమారు రూ.81 లక్షలు అవుతుందన్నారు. వీటితో పాటు తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా, జమునా తాలూకా, సారా మందయ్ గ్రామానికి చెందిన ఆండి గోవిందన్ అనే స్మగ్లర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో పదిమంది నిందితులు పరారయ్యారని వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. అరెస్టయిన నిందితుడిపై ఖాజీపేట, దువ్వూరు, మైదుకూరు, టి. సుండుల్లెలోని పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి దుంగలతో పాటు ఒక కీప్యాడ్ ఫోన్, రెండు గొడ్డళ్లు, రెండు కొడవళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అటవీ సంపద ఎర్రచందనం అన్నారు. అలాంటి ఎర్రచందనాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా గుర్తుపెట్టుకోవాలన్నారు. సమీప ప్రాంతాలలో ఎవరైనా ఎర్రచందనం అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్డే, రాయచోటి డీఎస్పీ యంఆర్ కృష్ణమోహన్, రూరల్ సీఐ వరప్రసాద్, సుండుపల్లె ఎస్‌ఐ యం. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రూ. 81 లక్షల విలువైన
26 దుంగలు స్వాధీనం