
మినీ మహానాడుకు కీలక నేతల డుమ్మా
రాయచోటి : రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ నిర్వహించిన మినీమహానాడు కార్యక్రమానికి కీలక నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో గాలివీడు మండల కేంద్రంలో శనివారం మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుగవాసి పాలకొండరాయుడు తనయులు సుబ్రమణ్యం, ప్రసాద్‌బాబు, లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డితోపాటు వారి అనుచరులు దూరంగా ఉన్నారు. 40 ఏళ్లుగా టీడీపీకి సేవలు అందిస్తూ పార్టీ అభివృద్దికి పాటుపడిన సుగవాసి కుటుంబానికి ప్రాధాన్యత కల్పించకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. మినీ మహానాడులో దివంగత నేత సుగవాసి పాలకొండరాయుడుకు కనీసం నివాళులు అర్పించకపోవడం ఎంత వరకు సమంజసమంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ గెలుపు కోసం పని చేసిన సీనియర్ నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా, సీనియర్ నేతగా, నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రవేసుకున్న పాలకొండరాయుడుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు, స్థానిక నేతలు తగిన గౌరవం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం నిర్వహించిన మినీ మహానాడుకు సుగవాసి వర్గానికి, పార్టీలోని పాత సీనియర్ నేతలకు పిలుపు లేకపోవడంపై పార్టీలోని ఆ వర్గాలు కినుక వహించినట్లు తెలియవచ్చింది. టీడీపీ పండుగలా జరుపుకొనే మినీ మహానాడుకు పార్టీలోని సుగవాసి పాలకొండరాయుడు తనయులు సుబ్రమణ్యం, ప్రసాద్ బాబుతోపాటు వారి వర్గం, పాత సీనియర్ నేతలు దూరం కావడంపై నియోజకవర్గంలో సర్వత్రా చర్చనీయాంశమైంది.
రాయచోటిలో సుగవాసి, ద్వారకానాథరెడ్డి దూరం

మినీ మహానాడుకు కీలక నేతల డుమ్మా