
మట్టి తరలింపు కొండంత!
అనుమతులు కొంత..
ఒంటిమిట్ట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచింది. అప్పటి నుంచి రెడ్‌బుక్ పరిపాలన మీద పెట్టిన ధ్యాస ప్రజా పరిపాలనపై పెట్టకుండా అక్రమార్జనకు కూటమి నేతలు నేనంటే నేను అంటూ వరుస పెడుతున్నారు. ప్రజలనే కాకుండా జల వనరులను కూడా దోచుకునే విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఉన్నారు. ఇసుక, మట్టి, అడవిని కూడా దోచుకునేందుకు వెనుకాడటం లేదు. దోచుకుని దాచుకోవడంలో కూటమినేతల తరువాతనే మరెవరైనా అనే విధంగా మండలంలో నేతలు వ్యవహరిస్తున్నారు. ఇదే తంతు ఒంటిమిట్ట మండల కేంద్రంలో జరుగుతోంది. మండల కేంద్రమైన ఒటిమిట్ట చెరువులో రైతులకు ఉచితంగా మట్టి తరలింపు అనే ముసుగులో మూడురోజుల నుంచి కూటమి నేతలు ఇరిగేషన్ అనుమతులకు విరుద్ధంగా మట్టిని దోచేస్తున్నారు. రైతులకు ఉచితం అంటూ ఆదేశాలు ఉన్నా ఇక్కడి కూటమి నేతలు మాత్రం ఒక్కో ట్రిప్పు ట్రాక్టర్ మట్టికి రూ. 600 లెక్కన రైతుల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. భారీ యంత్రాలతో ట్రాక్టర్లకే కాకుండా పెద్దపెద్ద టిప్పర్లకు మట్టిని పోసి తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతులు ఉన్న పొలాలకు మాత్రమే మట్టి తరలించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు రెండు గ్రామాలలోని ముగ్గురు రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వగా దానికి విరుద్ధంగా అనుమతులు లేని గ్రామాలకు కూడా మట్టిని తరలించి కూటమి నేతలు రోజుకు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతుల ముసుగులో ప్రతి రోజు దాదాపు 500 ట్రిప్పులపైబడి అక్రమ మట్టి రవాణా చేస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా మట్టి మాఫియా జరుగుతుందన్న సమాచారం సంబంధిత అధికారులకు తెలిపినా వారి వద్ద నుంచి ఎలాంటి చలనం లేకపోవంతో సంబంధిత అధికారులకు భారీ ముడుపులు ముట్టాయని మండలంలో చర్చ జరుగుతోంది.
ముగ్గురు రైతులకు మాత్రమే అనుమతి..
మట్టి తరలింపుపై మండలంలోని సాలాబాదు, ఒంటిమిట్ట గ్రామ రైతులుగా ఉన్న ముగ్గురికి మాత్రమే మూడు రోజుల క్రితం ఒంటిమిట్ట చెరువులో వారి పొలాలకు మట్టి తరలించుకునేందుకు అనుమతి ఇచ్చామని ఒంటిమిట్ట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు.
జేసీబీ సహకారంతో చెరువులో
మట్టిని తరలించొచ్చు..
రైతులకు ఉచితంగా మట్టిని తరలించే విషయంలో జేసీబీని వాడుకోవచ్చు. ట్రాక్టర్లే కాకుండా టిప్పర్లను కూడా రవాణాకు ఉపయోగించవచ్చు. రైతులకు పూర్తి ఉచితంగా మట్టిని తరలించాలి. ఒక క్యూబిక్ మీటర్‌కు కేవలం ఒక రూపాయి మాత్రమే రైతు ప్రభుత్వానికి చెల్లించాలి. వారు చెల్లించిన రూపాయి కూడా మళ్లీ తిరిగి వారి ఖాతాలోకి జమ చేస్తాము. మూడు రోజులపాటు 500 క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకోమని అనుమతి ఇచ్చాం. అలా కాకుండా అనుమతులకు విరుద్ధంగా మట్టి రవాణా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– కిషోర్, ఇరిగేషన్ శాఖ ఏఈ

మట్టి తరలింపు కొండంత!