
వింత ఆకారంలో కుక్క పిల్ల జననం
పెద్ద తిప్పసముద్రం: అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలంలోని బూచిపల్లిలో గురువారం వింత ఆకారంలో కుక్కపిల్ల జన్మించింది. డేగానిపల్లి నరసింహులు చెందిన కుక్క ఈ పిల్లకు జన్మనిచ్చింది. కాళ్లు, చేతులు శునకం లాగే ఉన్నా.. ముఖం వద్ద తొండం లాగా ఉంది. ముందు భాగం ఏనుగు ఆకారంలో.. వెనుక భాగం కుక్కలాగా ఉంది. గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి.. దీన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. తల్లి వద్ద పాలు తాగేందుకు తొండం అడ్డు రావడంతో అది కొద్ది సేపటికే మృతి చెందింది. ఇది జన్యులోపం వల్ల జన్మించి ఉండవచ్చని పశువైద్యులు తెలిపారు.
17నుంచి వైద్య, వైజ్ఞానిక శిక్షణ తరగతులు
మదనపల్లె సిటీ: రాష్ట్ర వైద్య,వైజ్ఞానిక శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ తెలిపారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 17 నుంచి 26 వరకు శిక్షణా తరగతులు జరుగుతాయన్నారు. ఈ తరగతులకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. విద్యార్థుఽలు నాయకత్వం వహించడానికి నైపుణ్యం కోసం.. భవిష్యత్తు తరాల నాయకుల తయారు చేయడానికి ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ రీయింబర్స్‌మెంట్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, కార్యదర్శి రమణ, జయబాబు, ఆఫ్రిద్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
పీజీ ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆచార్య పద్మ మాట్లాడుతూ ఏప్రిల్‌లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు త్వరితగతిన విడుదలకు కృషిచేసిన పరీక్షల విభాగాన్ని అభినందించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కెఎస్వీ కృష్ణారావు మాట్లాడుతూ ఎంఏ తెలుగు, హిస్టరీ, పీఎస్ అండ్ పీఏ, ఎకనామిక్స్, ఉర్దూ ఎంకాం కోర్సులలో విద్యార్థులు వంద శాతం ఫలితాలను సొంతం చేసుకున్నారని వివరించారు. అఫిలియేటెడ్ కాలేజీల్లో ఎం కామ్ లో 96.30 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. ఎమ్మెస్సీ.. బోటని, బయోకెమిస్ట్రీ, జియాలజి,మ్యేథమ్యాటిక్స్ మైక్రోబయాలజి, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సు, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్, పుడ్ టెక్నాలజీ , ఎంపీఈడీ కోర్సుల్లో వందశాతం ఉత్తీర్ణత లభించిందన్నారు. విద్యార్థులు ఫలితాల కోసం https: www.yvuexams.in/results.aspx అనే వైబ్సెట్‌ను సందర్శించాలని కృష్ణారావు సూచించారు.
ఏఐ శక్తివంతమైన
సాంకేతిక పరిజ్ఞానం
కురబలకోట: ప్రపంచ మంతటా ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) గాలి వీస్తోందని, అత్యంత శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానంగా అవతరిస్తోందని బెంగళూరులోని జార్పీ ల్యాబ్స్ సీఈఓ శ్రీకాంత్ అరిమాదిత్య పేర్కొన్నారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో నెక్ట్స్ న్యూ ఏఐ వెంచర్ స్టూడియోపై గురువారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎక్కడ చూసినా ఏఐ మాట విన్పిస్తోందన్నారు. వ్యవస్థలతో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, న్యాయం, పరిపాలన, ఉత్పాదకత,ఉద్యోగ అవకాశాలలో సత్తా చాటుతోందన్నారు. ప్రపంచ మంతటా అనేక ఏఐ వెంచర్ స్టూడియోలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కొత్త స్టార్టప్‌లను ప్రారంభించడం, పెట్టుబడులు సమీకరించడం, వ్యాపార అభివృద్దిలో దోహదపడుతోందన్నారు. ఈ ఏడాదిని ఏఐ సంవత్సరంగా ఏఐసీటీఈ కూడా ప్రకటించిందన్నారు. ఏఐతో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతం కానుందన్న ధీమాను వ్యక్తం చేశారు.

వింత ఆకారంలో కుక్క పిల్ల జననం

వింత ఆకారంలో కుక్క పిల్ల జననం