
మా బంగారం ఇప్పించండి సారూ!
రాజంపేట రూరల్ : తమ అన్న కూతురి వివాహంలో కనిపించకుండా పోయిన తన 343 గ్రాముల బంగారం ఆచూకీ కనుగొని తనకు ఇప్పించండి సారూ అని బాధిత మహిళ సానంరెడ్డి నాగమణి ఏఎస్పీని వేడుకున్నారు. మండల పరిధిలోని ఎస్.ఎర్రబల్లి వద్ద ఉన్న ఏఎస్పీ కార్యాలయం వద్దకు తన బంధువులతో కలసి వచ్చిన ఆమె ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డేను ఆశ్రయించి సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని విద్యుత్ నగర్‌లో నివాసం ఉంటున్న తన అన్న జోగి సుదర్శన్‌రెడ్డి కుమార్తె సాయినందిని వివాహానికి గత నెల 28న వచ్చినట్లు తెలిపారు. తన కుమార్తె వర్షిణి 343 గ్రాముల బంగారాన్ని దుస్తుల బ్యాగ్‌లో పెట్టుకుని తనవెంట తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆ బ్యాగ్‌ను తన అన్న గృహంలోని పడక గదిలో గల మంచంపై ఉంచి బంధువులతో ముచ్చటించి పెళ్లి పనుల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. అనంతరం రాత్రి 10.30 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు తన కుమార్తె దుస్తులు మార్చుకునేందుకు బ్యాగ్ తెరిచినప్పుడు బంగారం అలాగే ఉందని, ఉదయం 10 గంటల సమయంలో బ్యాగును తెరవగా అందులోని దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని పేర్కొన్నారు. దుస్తుల మధ్య ఉంచిన బంగారం కనిపించకపోవడంతో తన అన్న సుదర్శనరెడ్డితో పాటు బంధువులకు తెలియజేశామన్నారు. 19 మందిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశానని వారిలో కొందరు కువైట్‌కు వెళ్లి పోయారని ఆమె వివరించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.