
కె.కె.కొట్టాల గ్రామస్తులకు న్యాయం చేయండి
● టెయిలింగ్ పాండ్‌తో
పంటలు పండక నష్టపోతున్నారు
● కలెక్టర్‌ను కోరిన
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
వేముల : యురేనియం బాధిత గ్రామమైన కె.కె.కొట్టాల గ్రామస్తులకు న్యాయం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు విజ్ఞప్తి చేశారు. మండలంలోని కె.కె.కొట్టాల గ్రామస్తులు మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కలిసి టెయిలింగ్ పాండ్‌తో పడుతున్న ఇబ్బందులను, సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బాధిత రైతులను వెంట బెట్టుకుని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన టెయిలింగ్ పాండ్‌తో కె.కె.కొట్టాల గ్రామస్తులు నష్టపోతున్న తీరును, గ్రామస్తుల ఇబ్బందులను ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటికే టెయిలింగ్ యురేనియం వ్యర్థాలతో నిండిపోయిందని, కాలుష్యంవలన గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని విన్నవించారు. టెయిలింగ్ పాండ్ నిండిపోవడంతో టెయిలింగ్ పాండ్ ఎత్తు పెంచే పనులు చేస్తున్నారని, టెయిలింగ్ పాండ్ ఎత్తు పెంచితే గ్రామస్తులు ఇంకా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు. ఇప్పటికే గ్రామస్తులు తమ సమస్యలను పరిష్కరించేంతవరకు టెయిలింగ్ పాండ్ పనులు చేపట్టవద్దని పనులను అడ్డుకున్నారని పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాల టెయిలింగ్ పాండ్‌తో నష్టపోతున్న కె.కె.కొట్టాల గ్రామాన్ని యూసీఐఎల్ తీసుకుని పునరావాసం, ఉద్యోగాలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ శ్రీధర్ టెయిలింగ్ పాండ్‌తో నష్టపోతున్న కె.కె.కొట్టాల గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు న్యాయం చేస్తానని హామి ఇచ్చినట్లు బాధిత రైతులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రంగనాథం, బాధిత రైతులు పాల్గొన్నారు.
మున్సిపల్ విభాగ బలోపేతానికి కృషి చేయాలి
కడప కార్పొరేషన్ : జిల్లాలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ విభాగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఎంపీని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి వై. శ్రీరంజన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి రావడానికి కృషి చేసినందుకు కృతజ్ఙతలు తెలుపుతూ సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, తద్వారా పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆర్‌టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి, ఐస్‌క్రీం రవి, రెడ్డి ప్రసాద్, వెంకటేష్ పాల్గొన్నారు.