తడబడితే తప్పదు మూల్యం | - | Sakshi
Sakshi News home page

తడబడితే తప్పదు మూల్యం

May 13 2025 2:44 AM | Updated on May 13 2025 2:44 AM

తడబడి

తడబడితే తప్పదు మూల్యం

కడప ఎడ్యుకేషన్‌ : విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు హంగులూ, ఆర్భాటాలతో తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తూ ప్రవేశాల ప్రక్రియను చేపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థుల చేరికలో ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్నదేదో లేనిదేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ నియంత్రణ కొరవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కొన్ని విద్యా సంస్థలు సీబీఎస్‌ఈ అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి. మొదట ఓపెనింగ్‌ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్‌ అనుమతి తీసుకోవాలి. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. ఇలా అన్ని అనుమతులుంటేనే పాఠశాలలను నిర్వహించాలి.

వీటిపై ఆరా తీయండి..

ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి కచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి. ఇది నిబంధన. అయితే చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్‌ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి గుర్తింపు తీసుకోవడం తప్పనిసరి. గుర్తింపు పొందిన విద్యా సంస్థలలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యా సంస్థల తరపున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థుఽలను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్‌ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులు కచ్చితంగా విచారించి విద్యా సంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకున్న తరువాతే పిల్లలను చేర్పించాలి.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు..

ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలి. విద్యార్థులకు పాఠశాలల్లో క్రీడా మైదానంతో పాటు అన్ని వసతులు పక్కాగా ఉండాలి. లేకుంటే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం. అదే విధంగా విద్యా సంస్థ పక్కాగా రిజిస్ట్రేషన్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు తప్పక పొంది ఉండాలి. తల్లిదండ్రులు ప్రైవేటు సంస్థల ఆకట్టుకునే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. అన్ని జాగ్రత్తలు పాటించి పిల్లలను చేర్పించాలి.

– షేక్‌ షంషుద్దీన్‌, డీఈఓ,

వైఎస్సార్‌ కడప జిల్లా

● తొలుత పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి.

● ప్రభుత్వ ఇంజనీరింగ్‌ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించాలి.

● మౌలిక వసతులతోపాటు బాత్‌రూములు, మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు తప్పనిసరి.

● విద్యార్థుల మానసిక, శారీరక ఉల్లాసానికి ఉపకరించే క్రీడా ప్రాంగణం, అనుగుణంగా క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా ఆరా తీయాలి.

● అర్హత గల ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారా లేదా పరిశీలించాలి.

● ప్రాఽథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాల అయితే సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి.

● సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణాశాఖ జారీ చేసిన సామర్థ్య పరీక్ష పత్రాన్ని జారీ చేస్తుంది. సుశిక్షితుడైన డ్రైవరు తప్పనిసరి.

● జీ–1 భవనాలు ఉంటే అగ్నిప్రమాపక పరికరాలు, ఆ స్థాయి దాటితే మంటలు ఆర్పే పూర్థిస్థాయి వ్యవస్థ ఉండాలి. సంబంధిత విభాగం నుంచి అనుమతి ఉండాలి.

● ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. చైల్డ్‌ ఇన్‌ఫో ఆధారంగానే విద్యార్థుల ప్రగతి పత్రాలు, బదిలీ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్నవారీగా పేర్కొంటున్నారు. ఫలితంగా సమస్యలు ఏర్పడతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివి..

ముందస్తు అడ్మిషన్లతో తస్మాత్‌ జాగ్రత్త

ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోసపోకండి

పాఠశాలల గురించి తెలుసుకున్నాకే పిల్లలను చేర్పించాలి

రిజిస్ట్రేషన్‌, గుర్తింపుపై ఆరా తీయండి

క్వాలిఫైడ్‌ టీచర్లు ఉన్నారని

పరిశీలించాకే అడ్మిషన్‌ తీసుకోవాలి

తడబడితే తప్పదు మూల్యం1
1/1

తడబడితే తప్పదు మూల్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement