కడప కల్చరల్ : వాట్సాప్ బాట్ ద్వారా ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియం చెల్లింపు సౌకర్యం మే 9 నుంచి అందుబాటులోకి వచ్చిందని కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ జీకేఆర్‌సీ రవికుమార్ తెలిపారు. ఇప్పటిదాకా ఎల్‌ఐసీ కస్టమర్ పోర్టల్‌పై 2 కోట్ల 20 లక్షల మంది తమ పాలసీలను నమోదు చేసుకున్నారని, ప్రతిరోజు మూడు లక్షల మంది ఆన్‌లైన్ సేవలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ వాట్సప్ బాట్ సౌకర్యం అదనంగా అందుబాటులోకి రావడంతో పాలసీదారులు ఎల్‌ఐసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదన్నారు. పాలసీలపై ప్రీమియంలు చెల్లించవచ్చన్నారు.
8976862090 వాట్సాప్ నంబరుకి ఏజీ అని మెసేజ్ చేస్తే, మన పాలసీలపై చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఆ తర్వాత వాట్సాప్ బాట్ నుంచే యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్స్ ద్వారా ప్రీమియం చెల్లింపులు చేయవచ్చన్నారు. ఇదే కాకుండా ఎల్‌ఐసీకి సంబంధిన మరో 14 సేవలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వాట్సాప్ బాట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన పాలసీదారులను కోరారు.
బస్టాండ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న వేలూరు పోలీసులు
మైదుకూరు : ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉన్న సమయంలో మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక్కసారిగా అక్కడున్న ఓ నిందితుడిని తమిళనాడులోని వేలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది చూసిన ప్రయాణికులు కొద్ది సేపు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. బస్టాండ్‌లో ఉన్న వ్యక్తిని సాధారణ పౌరుల దుస్తుల్లో ఉన్న కొంత మంది ఒక్క సారిగా పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లడం కలకలం రేపింది. అతన్ని వాహనంలో ఎక్కిస్తున్న సమయంలో ప్రయాణికులు వాహనాన్ని చుట్టుముట్టారు. పలువురు వీడియో, ఫొటోలు తీయకుండా ప్రయత్నించారు. అయితే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వారు ఫొటోలు తీయకుండా అడ్డుకున్నారు. తర్వాత తాము వేలూరు పోలీసులమని పలు కేసుల్లో ఈ వ్యక్తి నిందితుడిగా ఉన్నాడని, ఇతని కోసం నెల రోజులుగా గాలిస్తూ ఇప్పుడు పట్టుకున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయొద్దని అన్నారు.
ఆలయంలో హుండీ చోరీ
కాశినాయన : మండలంలోని బాలాయపల్లె గ్రామం రామాలయంలో ఆదివారం అర్థరాత్రి హుండీ చోరీకి గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. దేవాలయం తాళం పగులకొట్టి హుండీ తీసుకెళ్లారన్నారు. ఊరి బయటికి వెళ్లి హుండీని పగులకొట్టి నగదు ఎత్తుకెళ్లారన్నారు. పోలీసులకు సమాచారం అందించామని గ్రామస్తులు తెలిపారు.