
గుర్తు తెలియని మహిళ మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలోని నేతాజీ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని ఒక పాడు బడిన గదిలో గుర్తు తెలియని మహిళ(45) మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచారు. వారు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఎవరైనా భిక్షాటనకు వచ్చి వడదెబ్బ సోకి మృతి చెంది ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని సీఐ వెంకటాచలపతి తెలిపారు.
భార్యపై కత్తితో దాడి
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో భార్యపై భర్త కత్తితో దాడిచేసిన ఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎం నేతాజీ కాలనీకి చెందిన రమణ తన భార్య సుజాత(45)పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వారు ఇటీవల కొంత అప్పుచేసి ఇంటిని నిర్మించారు. అప్పులు తీర్చేందుకు భర్తకు తెలియకుండా భార్య గొర్రెలు అమ్మడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన రమణ భార్య సుజాతపై కత్తితో దాడిచేశాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
మద్యం తాగి వాహనం నడుపుతున్న
వ్యక్తిపై కేసు నమోదు
సుండుపల్లె : మండల పరిధిలోని భైరవగుట్ట ఫారెస్ట్ చెక్‌పోస్ట్ ఆవరణలో ఎస్‌ఐ ముత్యాల శ్రీనివాసులు సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. నాలుగు చక్రాల లగేజ్ టెంపోను ఆపి తనిఖీ చేయగా డ్రైవర్ నాగేశ్వర మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు తనిఖీలో గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని మద్యం తాగిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.