
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి
రాయచోటి: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్ ఆవరణలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో చైన్నె యాక్సెస్ హెల్త్ కేర్ ఫ్రీడమ్ ట్రస్టు సహకారంతో 150 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ. 50 లక్షల విలువైన కృత్రిమ కాళ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌లు విభిన్న ప్రతిభావంతుల కృత్రిమ కాళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ తోడ్పాటును అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలన్నారు. జిల్లాలో 150 మంది కాళ్లు కోల్పోయిన విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి ఈ ఏడాది మార్చి మొదటి వారంలో కృత్రిమ కాళ్లు కోసం కొలతలు తీసుకున్నామని.. వారందరికీ చైన్నెకి చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ ఫ్రీడమ్ ట్రస్టు ఆర్థిక సహకారంతో ఆధునిక కృత్రిమ కాళ్లు అమర్చామన్నారు. తమ ట్రస్టు తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలలో భాగం కావడం గర్వంగా ఉందని చైన్నె యాక్సెస్ హెల్త్ ఫ్రీడమ్ ట్రస్టు ప్రతినిధి డాక్టర్ సుందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు ఆర్‌వి కృష్ణ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు.