
మదనపల్లెలో సీఐడీ అధికారులు
మదనపల్లె: మండల తహసీల్దార్ కార్యాలయానికి మంగళవారం సీఐడీ అధికారులు వచ్చారు. మదనపల్లె ఫైల్స్ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సీఐడీ డీఎస్పీ పద్మలత... తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఆర్‌ఐ భరత్‌తో మాట్లాడారు. వలసపల్లె పంచాయతీలో ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి వివరాలు కోరితే.. ఇప్పటి వరకు ఇవ్వకపోవడంపై ప్రశ్నించారు. అలాగే ఇతర రిపోర్ట్‌లు ఆలస్యం చేస్తున్నారని, కేసు దర్యాప్తులో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి వివరాలు ఇవ్వడంతో పాటు లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తు పత్రాలను ఇవ్వాల్సిందిగా కోరారు.
కడప రిమ్స్ ప్రిన్సిపాల్ బదిలీ
కడప అర్బన్: ప్రభుత్వ సర్వజన వైద్యకళాశాల (రిమ్స్) ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఏ.సురేఖ నంద్యాల ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. 2022 అక్టోబర్‌లో పూర్తి అదనపు బాధ్యతలతో రిమ్స్ ప్రిన్సిపాల్‌గా విధుల్లో చేరిన డాక్టర్ సురేఖ తరువాత 2023 సెప్టెంబర్ నుంచి అడిషనల్ డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్‌గా ప్రస్తుతం వరకు సమర్థవంతంగా విధులను నిర్వహించారు. ఆమె స్థానంలో ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా, అడిషనల్ డీఎంఈ హోదాలో పనిచేస్తున్న డాక్టర్ టి.జమున కడప ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు.
గాలివాన బీభత్సం
ఓబులవారిపల్లె: మండలంలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. మండల వ్యాప్తంగా సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో వాన పడింది. వర్షానికి తోడు విపరీతంగా గాలులు తోడు అయ్యాయి. దీంతో కాకర్లవారిపల్లి, బోటిమీదపల్లి, రాళ్ల చెరువుపల్లి తదితర గ్రామాల్లో బొప్పాయి, అరటి చెట్లు నేలకొరిగాయి. వందలాది ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది. పంట చేతికందే సమయంలో గాలులకు నేలకు ఒరగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతంత మాత్రాన ఉన్న మామిడి కాయలు గాలులకు రాలిపోయాయి.
హుండీ ఆదాయం లెక్కింపు
వల్లూరు: పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు సమర్పించుకున్న కానుకలను కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. శాశ్వత హుండీల ద్వారా రూ 6,11,462 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా సేవా టికెట్ల ద్వారా రూ 69,750లు, అన్న దానం కోసం ఇచ్చిన చందాల ద్వారా రూ 78,285 వచ్చిందని, దీంతో మొత్తం కలిపి రూ 7,59,762 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవదాయ శాఖ కమీషనర్ జీ మల్లికార్జున, అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బా రెడ్డి, ఆలయ అర్చకులు అఖిల్ దీక్షితులు, పురావస్తు శాఖ, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
జిల్లాకు చేరిన
ఆక్ఫ్‌ఫర్డ్ డిక్షనరీలు
రాయచోటి జగదాంబ సెంటర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో భాగంగా పంపిణీ చేయడానికి ఆక్ఫ్‌ఫర్డ్ డిక్షనరీలు జిల్లాకు చేరాయి. జిల్లాలో డిక్షనరీలు భద్రపరిచిన పాయింట్‌ను డీఈఓ సుబ్రమణ్యం మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్లంపై పట్టు సాధించడానికి, విద్యార్థి స్వతహాగా ఆంగ్ల పదాల అర్థాలు తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడుతాయన్నారు. జిల్లాలోని 6వ తరగతి విద్యార్థులకు అందిస్తామన్నారు. ఈ సారి ఉర్దూ మీడియం విద్యార్థులకు ఆంగ్లం– ఉర్దూ డిక్షనరీలు అందిస్తున్నట్లు తెలిపారు. 653 ఆంగ్లం– ఉర్దూ డిక్షనరీలు, 8189 ఆంగ్లం– తెలుగు డిక్షనరీలు జిల్లాకు చేరాయన్నారు. ఆయన వెంట జిల్లా సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి(సీఎంఓ) కరుణాకర్, ఆక్ఫ్‌ఫర్డ్ ప్రాంతీయ మేనేజర్ వెంకటపతినాయుడు తదితరులు ఉన్నారు.

మదనపల్లెలో సీఐడీ అధికారులు